ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో దర్శి సీఐ వై రామారావు మరియు ఎస్సై మురళి మరియు సిబ్బంది కలిసి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్,హోటల్ లు, బేకరీలు మరియు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలు కనుక్కునే జగిలాం చీత, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మాదకద్రవ్యాలను గుర్తించే జాగిలం ‘రాక్సీ మరియు బాంబు స్క్వాడ్‌తో పాటు పోలీస్ లు పాల్గొన్నారు.
దర్శి ఆర్టీసీ బస్టాండ్, హోటల్, బేకరీలు,పార్శిల్ సెంటర్లలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు, ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు, అపరిచిత లగేజీలను గుర్తించేందుకు బస్టాండ్ ఆవరణ, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అనుమానం కలిగిన ప్రయాణీకుల బ్యాగులను ప్రత్యేకంగా ఓపెన్ చేయించి తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాలకు గుర్తించే జాగిలం రాక్సీతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పద పార్సిళ్లు కనిపించిన వెంటనే లేదా గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పటిష్టమైన భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.



