హైదరాబాద్, మే 16 ,(జే ఎస్ డి ఎం న్యూస్) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సాధనలో కీలక పాత్ర పోషించిన తొలి దశ, మలిదశ ఉద్యమకారుల సేవలు, త్యాగాలకు తగిన గౌరవం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి ఆన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు, గౌరవ పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే చర్య అని ఆయనఅభినందించారు. శనివారం తార్నాక డివిజన్లోని తన నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాలను అధికారికంగా గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం ఉద్యమకారులకు దక్కిన గొప్ప గౌరవమన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేయగా, మరికొందరు పోలీసు కేసులు, జైలు జీవితం, శారీరక–మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అలాంటి ఉద్యమకారులకు గుర్తింపు కల్పించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, వారి సేవల ప్రామాణికత నిర్ధారణ, సంక్షేమ చర్యల రూపకల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీఓ ఆర్టీ నం.679 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు చైర్మన్గా వ్యవహరిస్తుండగా, సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ–విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్తో పాటు మోతే శోభన్ రెడ్డి నియమితులయ్యారు.
ఉద్యమకారులను గుర్తించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అర్హులైన వారికి గౌరవం, సంక్షేమ సదుపాయాలు కల్పించే దిశగా కమిటీ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు మోతే శోభన్ రెడ్డి తెలిపారు.


