బోయినపల్లి, మే 20,
(జే ఎస్ డి ఎం న్యూస్):
లంచం తీసుకుంటూ మహిళా ఎస్సై అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాత బోయిన్ పల్లికి చెందిన అభిషేక్ అనే యువకుడు తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో కన్నతండ్రి కి , కుమారుడు అభిషేక్ కు మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆగ్రహావేశాలతో తండ్రి పై కుమారుడు దాడి చేశాడు. ఈ ఘటనపై బోయిన్పల్లి పిఎస్ లో తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసు విషయమై బోయిన్ పల్లి ఎస్సై నందితనిందితుడు అభిషేక్ ను రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ డిఎస్పి శ్రీధర్ తెలిపారు. అనంతరం ఈ కేసులో భాగంగా ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకం చేయాలని ఆదేశించారు. సంతకం పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందితుడిని రోజంతా ఠాణా లోనే కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ కు ప్రతి సోమవారం హాజరయ్యే విషయంలో ఉపశమనం కలిగిస్తానని చెప్పి రైటర్ విజయ్ తొలుత పదివేల లంచం తీసుకున్నట్లు తేలింది. ఈ కేసులో ఎస్సై నందితకు 15వేల రూపాయలు ఇవ్వాలని రైటర్ విజయ్ చెప్పగా నిందితుడు ఎస్సైని సంప్రదించగా అందుకు అంగీకరించని ఎస్ఐ నందిత తనకు 30 వేల రూపాయలు కావాలని హుకుం జారీ చేసింది. ఈ పరిణామాలతో తీవ్రంగా విసిగిపోయిన నిందితుడు అభిషేక్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి లంచం తీసుకున్న ఎస్సై నందితను రైటర్ విజయ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీస్ స్టేషన్ పార్కింగ్ ప్రాంగణంలో ఉన్న ద్విచక్ర వాహనంలో 30 వేల రూపాయలనగదును,వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో పోలీస్ స్టేషన్లలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే లంచం అడిగినట్లయితే తమను 1067 కు సంప్రదించాలని డిఎస్పి శ్రీధర్ స్పష్టం చేశారు.
