హైదరాబాద్ జూన్ 24 :
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ ఈసీఈఆడిటోరియంలో ‘AI & డిజిటల్ లెర్నింగ్ ట్రెయిన్ ది ట్రైనర్’ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ – టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (అన్న అక్క మెంటార్‌షిప్)లో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దూరదృష్టికి ప్రతీకగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా AI, కోడింగ్, డిజిటల్ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా మార్గదర్శకత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, వర్సిటీలను అనుసంధానిస్తూ ఈ వినూత్న విద్యా ఎకోసిస్టమ్‌ను రూపొందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణనుప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, AI, డిజిటల్ సాంకేతికతలు భవిష్యత్తును శాసించబోతున్నాయని, విద్యార్థులు ఉద్యోగాల కోసం చూసేవారుగా కాకుండా కొత్త ఆవిష్కరణలు చేసే నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఒక అకాడెమిక్ క్రెడిట్ కూడా లభిస్తుందని, ఇది దేశంలోనే ఒక వినూత్న నమూనా అని కొనియాడారు. ఓయూ డీన్ ప్రొఫెసర్ బి. లావణ్య మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థలు సామాజిక బాధ్యతతో అనుసంధానం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
రాష్ట్ర నోడల్ అధికారి డా. డి. సరిత మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా సుమారు 39,000 మంది విద్యార్థి ఇంటర్న్లు, 520 మంది నోడల్ అధ్యాపకులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవు
తున్నారని తెలిపారు. దీని ద్వారా 9000 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ వ్యవస్థలో ఓయూ, జేఎన్‌టీయూహెచ్, ఐఐటీ హైదరాబాద్, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన సహకారంతో ఈ శిక్షణ
సాగుతుండగా, ఓయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ బి. మంగుస్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నోడల్ అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


