సికింద్రాబాద్, జూన్ 25 : అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ కాలేజీలో విద్యార్థులకు భారీ అవగాహన కార్యక్రమం మరియు మానవ హారం నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ (IPS), బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బేగంపేట పోలీస్ సిబ్బంది, కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు వందలాది మంది విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు, మత్తు రహిత సమాజ స్థాపనకు ఈ సందర్భంగా విద్యార్థులందరితో కలిసి అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.
డ్రగ్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యం కావాలని మల్కాజ్‌గిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా తమ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవాలన్నారు. దేశానికి యువత శక్తే కొండంత అండ అని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి హితవు పలికారు.
క్షణికానందాన్ని ఇచ్చే మత్తు… జీవితాంతం కోలుకోలేని ముప్పును తెస్తుందని ఓయూ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కవితదేవి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. బేగంపేట ఇన్‌స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలై అమూల్యమైన జీవితాలను వృధా చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అన్నల పిలుపును అందిపుచ్చుకుని డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బేగంపేట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు.
అనంతరం కాలేజీ ఆవరణలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారంగా ఏర్పడ్డారు. మత్తు లేని లోకాన్ని సాధిద్దామంటూ సబ్‌ఇన్‌స్పెక్టర్లు శ్రావన్ కుమార్, షేక్ షఫీ, శ్రీధర్ మరియు విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ అవగాహన సదస్సు కాలేజీ విద్యార్థుల్లో సరికొత్త చైతన్యాన్ని నింపింది.
