బోయినపల్లి జూన్ 26 (జే ఎస్ డి ఎం న్యూస్) :
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్పేట్ సర్వే నెంబర్ 1 చత్రిగడ్డలో హైడ్రా (HYDRAA) అధికారులు శనివారం భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన విలువైన భూమిని కొందరుఅక్రమార్కులు కబ్జా చేసి, యథేచ్ఛగా నిర్మాణాలుచేపడుతున్నట్లు అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసుల భారీ బందోబస్తు నడుమ అధికారులు జేసీబీల సహాయంతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కొందరు కేటుగాళ్లు, నోటరీ ప్లాట్ల పేరుతో అమాయక ప్రజలకు విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కూల్చివేతలు శరవేగంగా కొనసాగుతుండగా, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సదరు భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోనున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని
ఈ సందర్భంగా అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.


