ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పేద కుటుంబాలకు పెద్ద భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీఎంఆర్ఎఫ్ కింద 103 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే అత్యవసర వైద్య చికిత్స కోసం 27 మందికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ…. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
