హైదరాబాద్, జూలై 1 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కాలం చెల్లిన (ఎక్స్పైరీ) మందులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరతాబాద్ ఎంఎస్ మఖ్తాలో ఉన్న ‘అల్ జమ్ జమ్ కెమిస్ట్’, ‘అల్ షిఫా మెడికల్’ దుకాణాలపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం బుధవారం ఆకస్మిక దాడులునిర్వహించింది. మందుల ప్యాకెట్లపై ఉన్న గడువు తేదీల వివరాలను కత్తిరించి, అమాయక ప్రజలకు విక్రయిస్తున్న నిర్వాహకుడు మహ్మద్ అజహరుద్దీన్, అతని వద్ద పనిచేస్తున్న సయ్యద్ సోహైల్లను పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి వద్ద నుండి మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే రూ. 88,277 విలువైన 3,187 కాలం చెల్లిన మాత్రలు, సిరప్లు, ఇంజెక్షన్లు, ప్రొటీన్ సప్లిమెంట్లను స్వాధీనంచేసుకున్నారు. నిందితుల నుంచి పట్టుబడిన సామాగ్రిని తదుపరి పరీక్షల నిమిత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్కు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ప్రజలు మందులు కొనేటప్పుడు తయారీ, గడువు తేదీలను ఖచ్చితంగా పరిశీలించాలని, అనుమానాస్పద విక్రయాలపై సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్ సూచించారు.
