ఓటర్లను ఇబ్బంది పెడితే ఊరుకోం: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.క్షేత్రస్థాయిలో సర్ (SIR) కార్యక్రమం పరిశీలన.

సనత్‌నగర్‌, జులై 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా అధికారులు పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం మోండా డివిజన్ పరిధిలోని బండిమెట్, అలాగే రాంగోపాల్‌పేట డివిజన్‌ నల్లగుట్ట ప్రాంతాల్లో సాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఓటర్లు, అధికారులతో మాట్లాడి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్యుమరేటర్ ఫారంలో 2002 నాటి ఓట్లకు సంబంధించిన వివరాలు అడుగుతుండటంతో తీవ్ర గందరగోళం నెలకొందని, ఆ కాలం నాటి వివరాలు ఓటర్ల దగ్గర ఎలా ఉంటాయని అధికారులను తలసాని నిలదీశారు. పాత వివరాలతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి సంబంధించిన వివరాలు మాత్రమే సేకరించాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (AERO) శైలజను ఆదేశించారు. ఫారాల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ‘సార్‌’ కార్యక్రమం సాఫీగా సాగేందుకు సిబ్బంది సంఖ్యను పెంచాలని సూచించారు. ఫారాలు నింపే విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఓటరు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. బీఎల్ఓలు, సహాయక సిబ్బందికి తమ పార్టీకి చెందిన బీఎల్ఏలు పూర్తి సహకారం అందిస్తారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మోండా డివిజన్‌కు చెందిన అనేకమంది ఓట్లు అమీర్‌పేట, బల్కంపేట ప్రాంతాల్లో ఉన్నాయనే విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని ఇక్కడికే మార్చేలా చర్యలు తీసుకోవాలని ఏఈఆర్‌ఓకు సూచించారు. దీనిపై స్పందించిన ఏఈఆర్‌ఓ శైలజ.. ‘సర్’ కార్యక్రమం పూర్తి కాగానే ఓట్ల మార్పిడి ప్రక్రియ చేపడతామని వివరించారు. అనంతరం పలువురు ఓటర్లు తమ ఎన్యుమరేటర్ ఫారాలను ఎమ్మెల్యే తలసానికి అందజేశారు. 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితాను పోల్చి వివరాలు అడగటం సమంజసం కాదని, ఫారం నింపడంలో ఇబ్బంది పడుతున్న ఓటర్లకు అధికారులు స్వయంగా సహకరించాలని తలసాని కోరారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బీఆర్‌ఎస్‌ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, ఓదెల సత్యనారాయణ, జయరాజ్, కిషోర్, ఆంజనేయులు, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *