హైదరాబాద్ జులై 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక గా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ ఉత్సవాల నిమిత్తం పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3,427 దేవాలయాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో రూ.15,05,41,150 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు, ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం జరగనున్నాయి. అదేవిధంగా ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు నగరంలోని ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఉత్సవాల వేళ దేవాదాయ, జీహెచ్‌ఎంసీ, పోలీస్, వాటర్ బోర్డు, వైద్యారోగ్య, విద్యుత్ సహా ఇతర ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్ల మరమ్మతులు, భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా, చార్మినార్ భాగ్యలక్ష్మి సహా దాదాపు 30 ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల అనంతరం ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నందున, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.