బేగంపేట జులై 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని కనీసం ఆరు నెలల పాటు పొడిగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ CC నగర్, బేగంపేట డివిజన్ పాటిగడ్డ, బల్కంపేట లోని బీజేఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి SIR కార్యక్రమం అమలును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో పలువురు ఓటర్లు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎన్యుమరేటర్ ఫారాలు నింపే విధానంపై బూత్ లెవల్ అధికారులకు (BLO) సైతం పూర్తి అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్యుమరేటర్ ఫారం సక్రమంగా లేకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నట్లు తెలిపారు. 2002 ఓటర్ల జాబితా అధికారుల వద్ద కూడా లేకపోవడం పట్ల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడిగిన పలు ప్రశ్నలకు BLO లు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ SIR కార్యక్రమం పూర్తిగా గందరగోళం గా ఉందని అన్నారు. అటు ఓటర్లు, ఇటు BLO లు కూడా అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. గత నెల 25 వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 24 వ తేదీ న ముగుస్తుందని తెలిపారు. సరిపడా సిబ్బంది లేకపోవడం వలన కార్యక్రమం నత్తనడకన సాగుతుందని వివరించారు. అనేకమంది తమకు ఎన్యుమరేటర్ పారాలు రాలేదని పిర్యాదు చేస్తున్నారని, కొరత ఉన్నదని తెలిపారు. 2002 ఓటరు జాబితాలు BLO ల వద్ద కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 2002 ఓటు వివరాలను నమోదు చేసే విషయంలో కూడా ఓటర్లు అయోమయానికి లోనవుతున్నారని పేర్కొన్నారు. 2002 లో ఉన్న నియోజకవర్గాలు, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల పేర్లు, పరిధులు మారడంతో పాటు నియోజకవర్గ సంఖ్య కూడా మారిన విషయాన్ని గుర్తు చేశారు. SIR కార్యక్రమం ఇప్పటి వరకు 10 శాతం కూడా పూర్తి కాలేదని, కానీ 60 శాతం జరిగినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఈ 10 రోజులలో 100 శాతం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ SIR కార్యక్రమం పారదర్శకంగా జరగాలంటే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని కూడా నియమించాలని, 6 నెలలు పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సుజాత, మాజీ కార్పొరేటర్ లు కుర్మ హేమలత, టి. మహేశ్వరి, నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, నాయకులు లక్ష్మీపతి, శ్రీహరి, ప్రేమ్, శేఖర్, అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వెంకట్ బాబు, ఆరీఫ్, అబ్బాస్, ఫహీం, అఖిల్ తదితరులు ఉన్నారు.


