మార్కాపురం, ఆగస్టు 30 : మార్కాపురం పట్టణంలోని ఎస్సి బాలికల హాస్టల్ లో ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టిఫిన్ ఆలస్యంగా పెట్టడం పట్ల సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్, స్వెటర్, నైట్ డ్రెస్, టవళ్ళు ఇవ్వకపోవడం పట్ల వార్డెన్, డీడీపై మంత్రి అసహనం వ్యక్తం చేచేశారు. పకడ్బందీగా మెనూ అమలు చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ పట్ల మంత్రి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ హాస్టళ్లకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ సిబ్బందిని నియమించామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధముగా రూ. 143 కోట్లతో ఎస్సి సంక్షేమ హాస్టళ్లకు మరమ్మతులు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పేద విద్యార్థులు అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి డోలా శ్రీ వీరాంజనేయస్వామి తెలిపారు.


