హరితాంధ్ర సాధనకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి చెప్పారు. బుధవారం ఆమె అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లా హరిత అభివృద్ధి సొసైటీ ( డిస్ట్రిక్ట్ గ్రీనరీ డెవలప్మెంట్ ఏజెన్సీ – డీ.జీ.డీ.ఏ.) సమావేశం జరిగింది. రాష్ట్రస్థాయిలో ‘ ఏపీ గ్రీన్ ‘ సొసైటీ తరహాలో జిల్లాస్థాయిలో డిజిడిఏ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు డీఎఫ్వో ( సామాజిక ) రాజశేఖర్ ఈ సందర్భంగా వివరించారు. జిల్లాలో అవసరాలను బట్టి వివిధ అధికారులను కూడా ఈ సొసైటీలోకి తీసుకునే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. 2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ సొసైటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. సభ్యులుగా ఉన్న డిపిఓ అనుపమ, ఇంచార్జి డ్వామా పి.డి. వెంకటేశ్వరరావు, డీఈవో రేణుక, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, డీఎఫ్వో ( టెరిటోరియల్ ) వినోద్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. రవి నాయక్, జలవనరుల శాఖ ఇంచార్జ్ ఈ.ఎస్. శివరామ్, డివిజనల్ అభివృద్ధి అధికారులు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. కాగా, జడ్పీ సీఈవో, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, సిపిఓ, సర్వే శాఖ సహాయ సంచాలకులను కూడా ఈ సొసైటీలోకి సభ్యులుగా చేర్చాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కూడా కమిటీలోకి తీసుకోనున్నారు. హరితాంద్ర సాధనే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె స్పష్టం చేశారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

