కలెక్టరేట్‌లో ఫైలుకు మోక్షమెప్పుడో?…..గాంధీలో వైద్యుల నియామకాల్లో తీవ్ర జాప్యం

సికింద్రాబాద్ అక్టోబర్ 7,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
అత్యవసర సేవ అయిన వైద్యరంగంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుని నిరుపేదలకు నాణ్యమైన చికిత్స అందించాలన్న ప్రభుత్వ సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన చేపట్టాల్సిన నియామకాల ప్రక్రియ కలెక్టరేట్ నిర్లక్ష్యం కారణంగా అటకెక్కింది. గాంధీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు వైద్యుల నియామకానికి సంబంధించిన దస్త్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్‌లో పడిపోవడంతో పేద రోగులకు మెరుగైన వైద్యం అందక అవస్థలు పడాల్సి వస్తోంది.
గాంధీ మెడికల్ కాలేజీలోని క్రిటికల్ కేర్, న్యూరాలజీ, ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ వంటి కీలక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా 56 అసిస్టెంట్ ప్రొఫెసర్, 16 సీనియర్ రెసిడెంట్స్ (ఎస్‌ఆర్), 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 ట్యూటర్, 3 ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం గతనెల 8వ తేదీన కాలేజీ పాలకవర్గం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో 48 మందిని, సీనియర్ రెసిడెంట్స్‌లో 8 మందితో పాటు మిగిలిన పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే ప్రొఫెసర్ పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో వాటిని బ్యాక్‌లాగ్‌లో పెట్టారు.
ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి తుది జాబితాను గతనెల 13వ తేదీనే కలెక్టర్ ఆమోదం కోసం అధికారులు పంపించారు. కానీ నెల రోజులు గడుస్తున్నా కలెక్టరేట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. కాలేజీ యంత్రాంగం పలుమార్లు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. గాంధీ ఆస్పత్రికి ప్రతిరోజూ దాదాపు 3 వేల మంది ఔట్ పేషెంట్లు, మరో 2 వేల మంది ఇన్‌పేషెంట్లు వస్తుంటారు. మరోవైపు ఎంబీబీఎస్, పారామెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులకు బోధన సాగించాల్సి ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో వైద్యుల నియామకాల్లో అలసత్వం ప్రదర్శించడం రోగుల ప్రాణాలతో పాటు విద్యార్థుల విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పెండింగ్ ఫైలుకు మోక్షం కలిగించాలని, తద్వారా నిరుద్యోగ వైద్యులకు కొలువులు, రోగులకు సేవలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతాయని ప్రజలు కోరుతున్నారు.
కలెక్టర్‌ పరిశీలనలో ఉంది:
-ప్రొఫెసర్‌ ఇందిర, గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే గతనెల 8న ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారి జాబితాను కలెక్టర్ ఆమోదం కోసం పంపించాం. కలెక్టర్ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్లే ఫైలు పరిశీలనలో కొంత జాప్యం జరిగిందని భావిస్తున్నాం. త్వరలోనే కలెక్టర్ ఆమోదం లభించిన వెంటనే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తాం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *