అమరావతి : ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. జరుగుమల్లి మండలంలోని నర్సింగుల గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ప్రత్యేకించి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గర్భ కండ్రిక భూ సమస్యలకు సీఎం పరిష్కారం చూపనున్నారు. మొత్తం 4 మండలాల్లో 8 గ్రామాల్లో విస్తరించిన 2915 ఎకరాల భూములను వివాదాల నుంచి తొలగించి 1301 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. కొండపి మండలంలోని ఇలవర, వెన్నూరు, జరుగుమల్లి మండలంలోని పచ్చవ, వర్దినేనిపాలెం, నర్సింగోలు, కె.బిట్రగుంట, నాగులుప్పలపాడులోని ఓబన్నపాలెం, సింగరాయకొండలోని కాలికివాయ గ్రామాల్లో గర్భ కండ్రిక భూములకు వివాదాల నుంచి విముక్తి కల్పించనున్నారు. మొత్తంగా ఈ అక్టోబరు నెలలో 4.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయించారు. ఉదయం అమరావతి నుంచి బయల్దేరి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలుకు చేరుకోనున్నారు. గ్రామంలోని స్థానిక రైతులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. 8 గ్రామాల్లోని రైతులకు గర్భకండ్రిక భూముల సమస్యలను పరిష్కరించి పట్టాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంలకు మీ భూమి-మీహక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం బహిరంగ సభకు హాజరు అవుతారు. గ్రామసభలో పాస్ పుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు అమరావతికి చేరుకుంటారు.
మంత్రులు సమన్వయ సమావేశం నిర్వహణ ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరుగుమల్లి మండలం నర్సింగోలు పర్యటనపై సమన్వయ సమావేశం నిర్వహించారు . మంత్రులు డా. డోలా బాల వీరాంజనేయస్వామి , గొట్టిపాటి రవి కుమార్ , ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు , ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ , మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య , మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మరియు తదితరులు పాల్గొన్నారు .



Save or share this story as a newspaper-style Epaper Clip: