అద్దంకిలో రూ.30 కోట్లతో సీసీ రోడ్లు.. రూ.1.50 కోట్లతో స్టేడియాలు -నిషేధిత భూములకు చట్టపరంగా పరిష్కారం -ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అద్దంకి : పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో రూ.1.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఇండోర్ షటిల్ కోర్టు, జిమ్‌లకు మంత్రి భూమిపూజ చేశారు. త్వరలో సీఎస్ఆర్ నిధులతో లైబ్రరీ భవనాన్ని కూడా నిర్మిస్తామన్నారు. అన్ని పనులనూ ప్రభుత్వమే చేయడం సాధ్యం కాదని, సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మించడంతోపాటు విద్యార్థులకు సైకిళ్లు, దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిళ్లు అందించామని చెప్పారు. అద్దంకి పట్టణంలో రూ.30 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.అద్దంకిలో పట్టణంలో ఇప్పటికే నాలుగు వేల కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను ఐదు పైసలు కూడా పెంచలేదని, ఇకపైనా పెంచబోమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఛార్జీలు పెంచడంతోపాటు వెళ్తూ వెళ్తూ రూ.20 వేల కోట్ల ఈఆర్సీ భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపిందని ఆయ‌న‌ విమర్శించారు. ఎల్‌నినోతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింద‌న్నారు. ఈ ప్రభావంతో విద్యుత్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.78 వేల సబ్సిడీతో అందుబాటులో ఉన్న పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే పీక్ అవర్స్‌లో విద్యుత్ సమస్యలను తగ్గించవచ్చన్నారు. సోలార్ వినియోగానికి ప్ర‌జ‌లు మ‌రింత‌గా మొగ్గు చూపాల‌ని ఆయ‌న‌ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గి వ్యవసాయం దెబ్బతినడంతో బియ్యం ధరలు పెరిగాయన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వమే కిలో బియ్యాన్ని రూ.48కి విక్రయిస్తోందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దీర్ఘ‌కాలిక భూ స‌మ‌స్య‌ల‌కు చ‌ట్ట ప‌రిధిలో ప‌రిష్కారం…

అద్దంకి నియోజకవర్గంలో నిషేధిత భూములు, దేవాదాయ శాఖ భూములు, 22ఏ జాబితా కారణంగా ఏళ్ల తరబడి దీర్ఘ‌కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. దీర్ఘకాలిక భూ సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు లేని భూముల సమస్యలను సీఎం ఆదేశాలకు అనుగుణంగా పరిష్కరిస్తున్నామన్నారు. నిషేధిత జాబితాలో ఉండటంతో భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడం, వాటిని పిల్ల‌ల‌కు కూడా బదలాయించలేకపోతున్న పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారు. దైవాలరావూరు గ్రామం మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయ‌ తెలిపారు.దైవాల‌రావూరు సమస్యను సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే పరిష్కరించామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. అదే విధంగా దీర్ఘకాలంగా నిషేధిత జాబితాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న భూ సమస్యలను గుర్తించాలని ఇప్పటికే తహశీల్దార్లను ఆదేశించినట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చట్టపరంగా అవకాశం ఉన్న ప్రతి భూ సమస్యనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు కూట‌మి నేత‌ల‌తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *