ఓటర్ల జాబితాలో కొత్తగా చేర్పులు, చనిపోయిన వారి పేర్లను తొలగింపు, ట్రాన్సఫర్ చేసేటప్పుడు నిబంధనలు ఉల్లంఘన జరగకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, తహశీల్దార్ మురళితో కలసి త్రోవగుంటలోని నాలుగో నెంబరు పోలింగ్ కేంద్ర పరిధిలో చేపడుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో సవరణలు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు ఆయన సూచించారు. అనంతరం నాగులుప్పలపాడు మండల కార్యాలయంలో ఎం.పి.డి.ఓ. జయమణి, తహశీల్దార్ సృజన్ కుమార్ ఎన్నికల సూపర్ వైజర్లతో ప్రత్యేకంగా సమీక్షించారు. మండల పరిధిలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ తీరుపై ఆయన ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగులుప్పలపాడు మండలంలో సుమారు మూడు వేల మంది ఓటర్లు చనిపోయారని తెలిపారు. డెత్సర్టిఫికెట్ లేదనే కారణంతో ఓటర్ల జాబితా నుంచి వీరి పేర్లను తొలగించకుండా ఉండరాదన్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలము, స్థానిక ప్రజల సాక్ష్యము, పంచాయతీలో ఉన్న వివరాల ఆధారంగా వీరి పేర్లను తొలగించడానికి బి.ఎల్.ఓ.లు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీని కోసం కుటుంబ సభ్యులకు నోటీసు ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా వివాహం చేసుకుని ఇతర ఊర్లకు వెళ్లిపోయిన ఆడపిల్లల ఓట్లను ప్రస్తుతం వారు ఉంటున్న పోలింగ్ కేంద్ర పరిధిలోకి బదిలీ చేయాలని అన్నారు. వివాహం చేసుకుని ఇక్కడకు వచ్చిన ఆడపిల్లల పేర్లను కూడా వారి తల్లిదండ్రులు ఉంటున్న గ్రామం నుంచి అత్త మామలతో ఉంటున్న గ్రామానికి బదిలీ చేయాలని చెప్పారు. ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలని కలెక్టర్ కోరారు. బి.ఎల్.ఓ.లు ఇంటింటి సర్వే చేస్తున్నప్పుడు రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ.లు కూడా వారితోపాటు ఉండాలని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక గ్రామం నుంచి వచ్చి మరో గ్రామంలో ఇల్లు నిర్మించుకుని, ఇంటి పన్ను చెల్లిస్తూ కొన్నేళ్ల నుంచి స్థిరపడినప్పుడు పాత గ్రామంలో కాకుండా కొత్త గ్రామంలోనే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ప్రతి ఇంటిలోని అర్హులందరూ దానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉండేలా ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు. ఇంటింటి సర్వే చేస్తున్న తీరులో
రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. బి.ఎల్.ఓ.లకు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యమైనట్లు తెలిపారు.


