ప్రపంచ పొగాకు రైతు దినోత్సవం నిర్వహణ – పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి- పనామాలో జరుగు సమావేశంలో పొగాకు సాగు రైతులకు భాగస్వామ్యం కల్పించాలి – పొగాకు బోర్డు సభ్యుడు మారెడ్డి సుబ్బా రెడ్డి

పొగాకు రైతుల ఆర్ధిక ప్రయోజనాలు పెంపొందించుకొనుటకు అంతర్జాతీయ పొగాకు సమాఖ్య (ఐటీజీఏ) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 28న పొగాకు రైతుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు పొగాకు బోర్డు సభ్యుడు మారెడ్డి సుబ్బా రెడ్డి అన్నారు. ప్రపంచ పొగాకు రైతు దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని రెండవ పొగాకు వేలం కేంద్రంలో శనివారం పొగాకు రైతు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు సభ్యుడు మారెడ్డి సుబ్బా రెడ్డి మాట్లాడుతూ దేశంలో 4.57 కోట్ల మందికి పొగాకు పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నదని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రైతుల సామాజిక మరియు ఆర్థిక స్థితి గతులు ఇతర వాణిజ్య పంటలు పండించే వారి కంటే మెరుగ్గా ఉన్నట్లు అసోచామ్ అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపారు. కేంద్ర పొగాకు సంస్థ అధ్యయనం కూడ పొగాకుకు ఇతర పంటలు కంటే లాభదాయకమని మరియు ప్రత్యామ్నాయం చూపటం కష్టమని తెలిపిన విషయాన్ని చెప్పారు. ప్రతి సంవత్సరం పొగాకు ఉత్పత్తులపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 70వేల కోట్లకు పైగా అదనంగా పొగాకు ఉత్పత్తుల ఎగుమతి ద్వారా విదేశీ మారకపు ఆదాయం సంవత్సరానికి రూ.13వేల కోట్లు వస్తున్నట్లు తెలిపారు. అధిక పన్నులు, చట్ట విరుద్ధమైన సిగరెట్ల వలన 2013 నుండి రూ. 7,500 కోట్లు ఆదాయం తగ్గుతుందని చెప్పారు. 2003- 04 సంవత్సరాలలో ఎస్సీవి పొగాకు పంట పరిమాణం 316 మిలియన్ కిలోలు ఉండగా 2021-22 నాటికి 189 మిలియన్ కిలోలకు కుదించబడినదని చెప్పారు. పంట తగ్గింపు వలన 35 మిలియన్ పనిదినాలు కోల్పోయారని వివరించారు. సుస్థిర పొగాకు ఉత్పత్తికి సంఘం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమగ్ర సస్యరక్షణా చర్యలు పాటించి పొగులో పురుగు మందుల అవశేషాలు తగ్గించటం పై రైతులు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. విష వ్యర్థాల సేకరణకు కేంద్రాలను ఏర్పాటు చేయటం, నారు పెంచుటకు ట్రే మరియు గ్రీన్ టెక్ పరిజ్ఞానం పై శిక్షణ ఇవ్వటం, బిందు సేద్యం, సుస్థిర భూ రక్షణ చర్యలు చేపట్టటం, పంట దిగుబడి పెంచుకొనుటకు తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటం వంటి కార్యాక్రమాలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ), ఫ్రేమ్ వర్క్ కన్వేన్షన్ అన్ టుబాకో కంట్రోల్ (ఎఫ్సీటీసీ) సంయుక్తంగా నవంబర్ 20 నుండి 25 వరకు పనామాలో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆసమావేశాలలో పొగాకు సాగు దారులను కీలక భాగస్వామ్యం చేసి వాదనలు విని పొగాకు పరిశ్రమను కాపాడాలని రైతు సంఘం నాయకులు, పొగాకు బోర్డు సభ్యులు కోరారు. పొగాకు సాగుపై ప్రభుత్వం రాయితీలు నిలిపివేసి పొగాకు సాగు నుండి తప్పించాలనే ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు సభ్యులు పొద వర ప్రసాదరావు, వడ్డెళ్ల వర ప్రసాద్, అబ్బూరి శేషగిరి, ఎర్రమనేని శేషయ్య, సుబ్బారావు, కేంద్ర అధ్యక్షుడు వీర నారాయణ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *