దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లలోని సిబ్బంది తమ విధి నిర్వహణలో అప్రమత్తంగా వుంటూ అంకితభావంతో విధులు నిర్వహించిన వివిధ డివిజన్ లో లోని 10 మంది ఉద్యోగులకు “మ్యాన్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో సోమవారం జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ చేతుల మీదుగా అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ ఆర్. ధనంజయులుతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు మరియు ఆరు డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీ అరుణ్ కుమార్ జైన్ జోన్ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన 10 మంది ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తతను ప్రదర్శించినందుకు మరియు అసురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకుగాను సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఇద్దరు , హైదరాబాద్ డివిజన్-01 ,విజయవాడ డివిజన్ –నలుగురికి , గుంతకల్ డివిజన్ - 01, నాందేడ్ డివిజన్ - 01 మరియు గుంటూరు ఒకరికి “మ్యాన్ ఆఫ్ ద మంత్” భద్రతా అవార్డులను అందజేశారు.
ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో మరియు ఇతర ఉద్యోగుల పనితీరును ప్రభావితం చేస్తాయని, అలాగే రైళ్లను సురక్షితంగా నడిపేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు గ్రహీతలలో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, కీ/గేట్ మ్యాన్ మరియు ట్రాక్ మెయింటెయినర్లు మొదలైన వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఉద్యోగులు తమ విధుల్లో అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తిస్తున్నందుకు వారిని అభినందించారు.
తరువాత, శ్రీ అరుణ్ కుమార్ జైన్ జోన్‌లో రైళ్ల రాకపోకల భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. జోన్‌లో సేఫ్టీ డ్రైవ్‌లను కొనసాగించాలని, అప్రమత్తంగా ఉండేందుకు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. లోకో పైలట్లు, ట్రాక్ మెయింటెయినర్లు, గార్డులు తదితర క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
జనరల్ మేనేజర్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు మరియు వాటి పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచి నిర్దేశించిన లక్ష్యాలను సమయానుసారం పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులకు జనరల్ మేనేజర్ సూచించారు.



