పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏ ఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న దగ్గరకే శిక్షణ కోసం అడు గుపెడితే ఎలా ఉంటుంది.. సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆవిష్కృతమైంది. ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ లు శిక్షణలో భాగంగా శనివారం ఆరీబీవీ ఆర్ఆర్ పోలీసు అకాడమీని సందర్శించారు. ఈ బృందంలోని ఉమా హారతికి ఆమె తండ్రి, పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందించి సరదాగా సెల్యూట్ చేయగా వారి మోముపై చిరుమందహాసం విరిసింది. ఆదివారం ఫాదర్స్ డే జరుపుకొంటున్న తరుణంలో ఒక రోజు ముందు ఈ ఘటన జరగడం విశేషం. శిక్షణ ఐఏఎస్లకు అకాడమీ జాయింట్ డైరెక్టర్ మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలకగా మరో డిప్యూటీ డైరెక్టర్ సి. నర్మద అకాడమీ కార్యక్రమాలను వివరించారు.
