కింద పడడాన్ని ముందే తెలుసుకోవ‌చ్చు!………

  • భ‌విష్య‌త్తులో రాబోయే స‌మ‌స్య‌ల‌పై ముందే అంచ‌నా
  • ప‌డిపోయే ల‌క్ష‌ణా థ్లు కూడా ముందుగానే గుర్తింపు
  • న్యూరో రీహాబిలిటేష‌న్‌కు ఏఐ సాయం
  • కిమ్స్ ఆస్ప‌త్రిలో రెండు రోజుల జాతీయ స్థాయి స‌ద‌స్సు
  • ఐదు రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా హాజ‌రు

వ‌య‌సుతో సంబంధం లేకుండా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా తుళ్లి కిందపడిపోవడం వంటివి తరుచు మనం చూస్తాం. అంతే కాకుండా చాలామందికి మోకాళ్లు అరిగిపోవ‌డం వ‌ల్ల మోకీళ్ల మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు (నీ రీప్లేస్‌మెంట్‌) చేయాల్సి వ‌స్తోంది. అలాగే ఇళ్ల‌లో ఉండే పెద్ద‌వారు ప‌డిపోవ‌డం వ‌ల్ల తుంటికి, ఇత‌ర భాగాల‌కు గాయాలు అవుతుంటాయి. అలా ప‌డిపోయే అవ‌కాశం ఎంత‌వ‌ర‌కు ఉంది, దాన్ని ఎలా నివారించాల‌న్న‌ది ముందే తెలుసుకుంటే! న్యూరో రీహాబిలిటేష‌న్‌లో స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం దీన్ని సుసాధ్యం చేస్తోంది. మ‌నకు ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి స‌మ‌స్యా లేక‌పోయినా, సంబంధిత వైద్యుల వ‌ద్ద‌కు వెళ్తే కొన్నిర‌కాల సుల‌భ‌మైన ప‌రీక్ష‌లు చేసి, భ‌విష్య‌త్తులో మ‌న‌కు రాబోయే స‌మ‌స్య‌లేంటో, వాటిని ఎలా నివారించుకోవ‌చ్చో కూడా చెబుతారు. స‌రిగ్గా ఇలాంటి విష‌యాల‌న్నింటిలో వ‌చ్చిన కొత్త టెక్నాల‌జీ గురించి కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన న్యూరో రీహాబిలిటేష‌న్ విభాగం ఆధ్వ‌ర్యంలో జాతీయ స్థాయి స‌ద‌స్సును శ‌ని, ఆదివారాల్లో నిర్వ‌హించారు. దీనికి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా ఫిజియోథెర‌పిస్టులు హాజ‌ర‌య్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రి న్యూరో రీహాబిలిటేష‌న్ విభాగాధిప‌తి డాక్ట‌ర్ అజ‌య్ కుమార్ మిద్దె మాట్లాడుతూ, “ఆస్ప‌త్రికి వ‌చ్చిన రోగుల‌లో ఎవ‌రిక ఏ త‌ర‌హా ఫిజియోథెర‌పీ చికిత్స‌లు అందించాల‌న్న‌ది చాలా ముఖ్యం. కొంద‌రికి కొన్నిర‌కాలే చేయాలి, కొంద‌రికి కొన్ని అస‌లు చేయ‌కూడ‌దు. ఇలాంటి విష‌యాల‌న్నీ ఫిజియోథెర‌పిస్టులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. దాంతోపాటు, చికిత్స‌ల‌లో స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం వ‌స్తున్న‌ట్లే.. భ‌విష్య‌త్తులో రాబోయే స‌మ‌స్య‌ల‌ను కూడా ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సుల‌భ‌మైన ప‌రీక్ష‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. కాస్త పెద్ద‌వ‌య‌సు వారు ప‌డిపోవ‌డం మ‌నం త‌ర‌చు చూస్తుంటాం. భ‌విష్య‌త్తులో ఇలా ప‌డిపోయే అవ‌కాశం బాగా ఎక్కువ‌గా ఉంటే వారిని వాక‌ర్‌తోనే న‌డ‌వాల‌ని, ఒక మాదిరిగా ఉంటే క‌ర్ర సాయం తీసుకోవాల‌ని చెబుతాం. బాగా త‌క్కువగా ఉంటే వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, న‌డిచే తీరు, కూర్చునే ప‌ద్ధ‌తి, కుర్చీలోంచి లేవ‌డం ఎలా లేవాలి.. ఇలాంటి విష‌యాల‌న్నీ చెబుతాం. దానివ‌ల్ల వారికి భ‌విష్య‌త్తులో స‌మ‌స్యే ఉండ‌దు. అలాగే మోకాళ్ల అరుగుద‌ల‌కు ఎలాంటి కార‌ణాలుంటాయి, డిస్క్ స‌మ‌స్య‌లు ఎందుకు వ‌స్తాయ‌నేది కూడా వివ‌రించి, అవి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్ప‌చ్చు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటాయి” అని తెలిపారు.

ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా కిమ్స్ ఆస్ప‌త్రుల గ్రూప్ ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, పాట్ర‌న్‌గా న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్
డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి, రిసోర్స్ ప‌ర్స‌న్‌గా డాక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ తెడ్ల‌, అతిథి వ‌క్త‌గా క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ శ్వేత పెండ్యాల‌, ఆర్గ‌నైజింగ్ ఛైర్మ‌న్‌గా న్యూరో రీహాబిలిటేష‌న్ విభాగాధిప‌తి డాక్ట‌ర్ అజ‌య్ కుమార్ మిద్దె, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీగా సీనియ‌ర్ న్యూరో ఫిజియోథెర‌పిస్ట్ డాక్ట‌ర్ సిద్ధార్థ గంటాయ‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *