ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రచారం చేసిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక, పథకం అమలులో మరోసారి దగా చేస్తోందని ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై పత్రిక ప్రకటన ద్వారా తూర్పారబట్టారు. పిల్లలు, తల్లులను పచ్చిగా మోసం చేస్తోందని, అది తల్లికి వందనం కాదని పిల్లలు, తల్లులకు పంగనామం అన్నట్లుగా వ్యవహరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ వంచనకు గురి చేస్తోందన్నారు. నీకు పదిహేను, నీకు పదిహేను, నీకు పదిహేను.. ఇంట్లో ఒక్కో పిల్లాడిని చూపిస్తూ.. మా ప్రభుత్వం రాగానే.. ఇలా అందరికీ రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంత మందికి కలిపి మొత్తం..రూ.45 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు ఇస్తామంటూ.. చంద్రబాబు మొదలు పార్టీ నాయకులు, కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తల్లికి వందనం పథకంపై ఆర్భాటంగా ప్రచారం చేశారన్నారు. టీడీపీ గొప్పగా చెప్నుకున్న ‘సూపర్ సిక్స్’లో కూడా పథకాన్ని చూపడం జరిగిందని, కానీ ఇప్పుడు ఆ సూపర్ సిక్స్‌నే ప్రస్తావించడం లేదన్నారు. తల్లికి వందనం అమలుపై ఇటీవల జీవో 29 జారీ చేసిన ప్రభుత్వం, అందులో ప్రతి పిల్లాడికి అని కాకుండా, ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తామంటూ ప్రకటించడం కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా నమ్మించి మోసం చేసిందో అర్ధమవుతుందన్నారు. అసలు ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలను కుంటున్నారో సమాధానం చెప్పాలని వైసీపీ ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఏటువంటి స్పందనా లేక ఎవరూ నోరు మెదపడం లేదన్నారు. దీంతో పూర్తిగా అఫెన్స్‌లో పడిన ప్రభుత్వం ఎటూ సమాధానం చెప్పలేక విద్యా శాఖ నుంచి ఒక నోట్ విడుదల చేయించిందన్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలతో ఆదేశాలు జారీ చేస్తామని ఇప్పుడు పథకంలో ఆధార్ లింక్ కోసమే, ఈ జీవో ఇచ్చామని అందులో చెప్పుకొచ్చారని శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. విచిత్రం ఏమిటంటే.. ప్రతి పథకాన్ని ఆధార్‌తో లింక్ చేస్తూ అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా పూర్తి పారదర్శకంగా అన్నింటినీ అమలు చేసి చూపింది వైయస్సార్ సీపీ ప్రభుత్వమని, ఇది గత అయిదేళ్లుగా అందరూ చూసిందే అన్నారు. అయినా విచిత్రంగా ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లబ్ధి కావాలంటే ఆధార్‌తో లింక్ కోసమే జీవో ఇచ్చామని సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మేనిఫెస్టోకు కట్టుబడి ఉండక పోవడం, ఇచ్చిన మాట తప్పడం, పథకాలు అమలు చేయక పోవడం, ప్రశ్నిస్తే దబాయించడం, ఎదురు దాడి చేయడం టీడీపీకి ఆనవాయితే అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం అమలు విషయంలో కూడా అదే ధోరణి చూపుతోందన్నారు. ఎందుకంటే వైయస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేపిన ‘అమ్మ ఒడి’ పథకం కాపీనే ఈ ‘తల్లికి వందనం’ అన్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పథకంలో అర్హులైన కొత్త పిల్లలను చేర్చి, పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ డిమాండు చేశారు. అయితే పథకానికి పంగనామం పెట్టడం కోసమే జీవో 29 ఇచ్చి దాన్ని సమర్థించుకోవడం కోసం, ఇప్పుడు ఏవేవో కుంటి సాకులు కూటమి ప్రభుత్వం చెబుతోందన్నారు. అదే జగన్ ఉండి ఉంటే ఇప్పటికే ‘అమ్మ ఒడి’కి సంబంధించి తల్లుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంతకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాన్ని పక్కాగా అమలు చేసింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని, వరసగా నాలుగేళ్లు క్రమం తప్పకుండా, అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా పథకాన్ని అమలు చేసి చూపిందన్నారు. అలా, నాలుగేళ్లలో నాలుగు విడతల్లో అమ్మ ఒడి పథకంలో వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.26,067.30 కోట్లు అని తెలిపారు. కాగా 2023–24 విద్యా సంవత్సరా నికి సంబంధించి, 43 లక్షల తల్లుల ఖాతాల్లో గత వేసవి సెలవుల తరవాత జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగానే అదే నెల (2024 జూన్) చివరి వారంలో రూ.15 వేల చొప్పున మరో రూ.6,400 కోట్లు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. కానీ ప్రజలను మోసం చేయడం, దగా చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే పద్ధతిగా ఉన్న టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా సరిగ్గా అదే చేస్తోందని, తల్లికి వందనం కాదు.. పిల్లలు, తల్లులందరికీ పంగనామాలు పెడుతూ మరోసారి అందరినీ పచ్చిగా మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు.
*చంద్రబాబు అంటేనే అబద్ధం, మోసం, దగా..*
చంద్రబాబు అంటేనే నయ వంచనకు మారుపేరని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. బాబు తీరు ఎప్పటికీ మారదన్నది అందరికీ అర్ధమైందన్నారు.
*జగన్‌పై అక్రమ కేసు..*
సాక్షాత్తూ సుప్రీంకోర్టు తప్పు పట్టినా, అప్పటి ఎంపీ రఘురామ ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చి చెప్పినా, ఆ కేసు అప్పుడే కొట్టివేసినా.. మళ్లీ ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా, మూడేళ్ల తర్వాత సీనియర్ ఐపీఎస్‌లతో పాటు, జగన్ పైనా, డాక్టర్‌పైనా కేసు నమోదు చేసిందన్నారు. ఎవరి సంతోషం కోసమో ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసమో అన్నట్లుగా మూడేళ్ల తర్వాత కేసు నమోదుతో కేవలం దురుద్దేశం, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసి, రాష్ట్రంలో పోలీసులు ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారని బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదని భవిష్యత్తులో అది వారికే ఇబ్బందిగా మారుతుందన్నది సుస్పష్టం అన్నారు. పిటిషన్‌ను సుప్రీంకోర్డు తోసి పుచ్చినా, మూడేళ్ల తర్వాత మళ్లీ రఘురామ ఫిర్యాదు చేస్తే అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసులో జగన్ ఎలా ముద్దాయి అవుతారని ప్రశ్నించారు. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది?.. 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని తేల్చి చెప్పిందని, మరి అలాంటప్పుడు మూడేళ్ళ తర్వాత విచారిస్తే ఏం జరుగుతుందని బూచేపల్లి ప్రశ్నించారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. రఘురామ ఫిర్యాదు మీద, న్యాయ సలహా తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారని, రఘురామ గత నెల 11న ఈ–మెయల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ కు రాశారని, అంటే రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా?, ఫిర్యాదు రిపోర్టు రాక ముందే లీగల్ ఒపీనియన్‌కు ఎలా రాశారు? దీనికి సమాధానం చెప్పగలరా? అని బూచేపల్లి శివప్రసాద్ ప్రశ్నించారు.

