ప్రస్తుతం సమాజంలో మృదుభాషణ కొరవడింది. ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత పెంపొందించాలంటే ఒక మాతృమూర్తి వల్లే సాధ్యం. ఏ ఇంటన మాతృమూర్తి శ్రీరామచంద్రునికి కౌసల్య మాత లాగా శివాజీ మహారాజ్ కి జిజియాబాయి మాత లాగా తమ బిడ్డలకు మంచి మార్గం చూపే విధంగా ఆధ్యాత్మిక చారిత్రాత్మక మహా సత్పురుషుల జీవిత చరిత్రలను బోధించాలి. అప్పుడు మాతృమూర్తి ప్రతి గృహసీమన తమ బిడ్డలకు, కుటుంబ సభ్యులకు తొలి గురువుగా ఉంటారని ప్రాంత మాతృ శక్తి సంయోజిక గౌరీ ప్రాణేష్ తెలిపారు.
ఆదివారం సాయంత్రం స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవన్ లో జరిగిన మాతృశక్తి సత్సంగ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా కర్నూల్ నుండి విచ్చేసిన గౌరి ప్రాణేష్ ప్రసంగించారు.
విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి విభాగం ద్వారా ప్రతి ఇంట మాతృమూర్తుల్లో ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, దేశభక్తి పెంపొందించడానికి ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల కేంద్రంగా వారానికి ఒకసారైనా సత్సంగత కార్యక్రమాలను నిర్వహించుకోవాలని, తద్వారా మాతృమూర్తి సత్సంగం ద్వారా తెలుసుకున్న విషయాలను తమ బిడ్డలకు బోధిస్తుందో ఆయా పిల్లలు దేశభక్తి కలిగి మంచి మార్గంలో పయనిస్తారని తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన యువతులను దుర్గా వాహిని విభాగంలోకి చేర్చి వారిని కూడా సత్సంగంలో కలుపుకోవాలని, విద్యతోపాటు వినయ విధేయతలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మ రక్షణ తదితర విషయ పరిజ్ఞానం సత్సంగం ద్వారానే అందించబడతాయి. కనుక సత్సంగాలు ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేయాలి అని కోరారు. సమావేశమునకు ముందు విష్ణు సహస్రనామ, ఏకాత్మతా స్తోత్రాలు, హనుమాన్ చాలీసా, విజయ మహామంత్రము, పఠించారు.
ఈ సమావేశంలో ప్రాంత సహకార్యదర్శి ప్రాణేష్ జి, ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, ఈమని బలరాం, పెరుమాళ్లు తదితర పరిషత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.



