జిల్లాలో బాల్యవివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాలలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండటంతో జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన ఏ.తమీమ్ అన్సారియా ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తూ ‘ బంగారు బాల్యం ‘ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. జిల్లా యంత్రాంగం చేస్తున్న ఈ ప్రయత్నానికి స్కోచ్ అవార్డుకు దక్కింది. ప్రజెంటేషన్, పబ్లిక్ ఒపీనియన్ , నిపుణుల ఓటింగ్ ఇలా.. మొత్తం మూడు రౌండ్లలో జరిగిన ఎంపిక ప్రక్రియలో నెగ్గి అవార్డు సాధించింది. త్వరలోనే న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు.
*మంత్రి స్వామి అభినందనలు…*
జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. ‘ బంగారు బాల్యం ‘ కార్యక్రమంతో జిల్లాలో బాల్యవివాహాలు అరికట్టేందుకు కలెక్టర్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ అవార్డు జిల్లాకు గర్వకారణమని, కలెక్టర్ పనితీరును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.