బేగంపేట ఏప్రిల్ 10(జే ఎస్ డి ఎం న్యూస్ ):
పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్ నగర్ లోని దాసారం లో సుమారు 300 కుటుంబాలు గత 30 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా బుధవారం కొందరు వ్యక్తులు తమ ప్రాంతానికి తమ అనుచరులతో వచ్చి గుడిసెలు ఖాళీ చేయాలని హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన వారు గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి తాము ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు తమను వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ, పోలీసు, జీ హెచ్ ఎం సి తదితర శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పేదల జోలికి రాకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. బాధితుల వెంట సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, కుమార్, వనం శ్రీనివాస్, దాసారం గుడిసె వాసులు తదితరులు ఉన్నారు.


