వేసవి దృష్ట్యా పశువులకు దాహం తీర్చే
నీటితొట్టెల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
హెచ్చరించారు. గురువారం ప్రకాశం భవనంలో డ్వామా అధికారులతోనూ, ఎంపీడీవోలతోనూ ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న నీటితొట్టెల నిర్మాణంలో జాప్యాన్ని సహించబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. మంజూరు అయిన నీటితొట్టెల నిర్మాణాలను ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఫారం పాండ్స్ నిర్మాణంపైనా దృష్టి సారించాలని చెప్పారు. ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వేసవి కాలం అనుకూలం అయినందున పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. వచ్చే మూడు నెలలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. లేబర్ మొబిలైజేషన్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధుల మంజూరుకు లేబర్ మొబిలైజేషన్ కీలకం అని ఆమె స్పష్టం చేశారు. కూలీలకు రోజువారి సగటు వేతనం రూ. 290 కు తగ్గకుండా చూడాలని చెప్పారు. చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సిబ్బంది ప్రతిరోజూ ఫీల్డ్ లో ఉండాలని ఆమె స్పష్టం చేశారు. కాగా , ఆయా పనులలో పురోగతిని పి.డీ. జోసఫ్ కుమార్ కలెక్టరుకు వివరించారు.
ఈ సమావేశంలో ఏ.పి.డి.లు, ఏ.పి.ఓ.లు, ఈ.సి.లు పాల్గొన్నారు.


