హైదరాబాద్ ఏప్రిల్ 24(జే ఎస్ డి ఎం న్యూస్) : హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ సెక్షన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లలో ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ , ప్రధాన కార్యాలయం , డివిజన్ నుండి ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.
ముందుగా అరుణ్ కుమార్ జైన్ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ హాల్ట్ స్టేషన్
నుండి తనిఖీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణీకుల సౌకర్యాలు, స్టేషన్ ఆస్తులు మరియు స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పధకం (ఏ.బి.ఎస్.ఎస్.) లో భాగంగా రూ. 6.07 కోట్ల వ్యయంతో స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. నిర్మాణ పనులు పురోగతిలోనున్నపుడు పాటిస్తున్న భద్రతా విధానాలు మరియు మార్గదర్శకాలను ఆయన పరిశీలించారు. అలాగే, నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కర్నూల్ లో నిర్మిస్తున్న కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ (సి.ఎమ్.ఎల్.ఆర్)కి నూతన లైన్ అనుసంధానాన్నికి సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించారు.
కొత్త లైన్ మరియు వర్క్‌షాప్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు జనరల్ మేనేజర్‌కు వివరించారు. కర్నూలులో సి.ఎమ్.ఎల్.ఆర్ వర్క్ షాప్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. సి. ఎమ్.ఎల్.ఆర్ వర్క్‌షాప్ నిర్మాణ పనులకై 2013-14 సంవత్సరంలో ప్రాధమికంగా 283 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసారు. తరువాత దానిని రూ. 562 కోట్లకు సవరించారు. ఈ వర్క్‌షాప్ పూర్తయిన తర్వాత, నెలకు 50 కోచ్‌లను మరమ్మతు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వర్క్‌షాప్‌లో అవసరమైన యంత్రాల ను కూడా అమర్చనున్నారు.తద్వారా కోచ్‌ల కాలానుగుణ ఓవర్ హాలింగ్ ఇక్కడ చేయవచ్చు. మొదటి దశలో నాన్-ఏసీ కోచ్‌ల మరమ్మత్తు చేపట్టే పని పూర్తవుతుంది మరియు తరువాత ఏసీ కోచ్‌ల నిర్వహణను చేపట్టడానికి వర్క్‌షాప్‌ను పెంచుతారు. కర్నూలు ఎంపీ నాగరాజు బస్తీపతి జనరల్ మేనేజర్‌ను కలిసి తన అధికార పరిధికి సంబంధించిన రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
ఆ తరువాత జనరల్ మేనేజర్ కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్ తనిఖీచేసి ప్రయాణీకుల సౌకర్యాలు/వసతులు, స్టేషన్‌లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్‌లో రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు మరియు స్టేడియంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఓపెన్ జిమ్ , పిల్లల ఆట స్థలం మొదలైన వాటిని సమీక్షించారు . పచ్చని వాతావరణం కోసం ఒక మొక్కను నాటారు. రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆధునిక క్రీడా పరికరాలను ఉపయోగించడం ద్వారావారి క్రీడా నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వ ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవడానికి ఈ స్టేడియం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తరువాత, జనరల్ మేనేజర్ కర్నూలు నుండి సికింద్రాబాద్ సెక్షన్ వరకు రియర్ విండో తనిఖీని నిర్వహించారు. ఈ తనిఖీలో వంపులు, వాలుతలం , వంతెనలు, సిగ్నల్స్ మరియు ట్రాక్‌ల నిర్వహణ మొదలైన అనేక భద్రతా అంశాలను సమీక్షించారు.
