వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి హాజరవుతున్న సమయం, వారి పనితీరుపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. ఆయా ఆసుపత్రుల పర్యవేక్షకులు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యునిటీ ఆసుపత్రుల పనితీరుపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా పనిచేస్తున్న సిబ్బంది – ఖాళీలు, రోజువారీ కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ల్యాబరేటరీ, ఎక్స్ రే, స్కానింగ్, ఈసీజీ, బ్లడ్ బ్యాంకు, డయాలసిస్, విద్యుత్ జనరేటర్, మరమ్మతులు / ఇతర నిర్మాణ పనులు, ఎన్టీఆర్ వైద్య సేవ క్లయిమ్స్ పరిష్కార తీరు, తదితర అంశాలలో పురోగతి పై ఈ సందర్భంగా కలెక్టరు ఆరా తీసారు. సి ఎస్ ఆర్ క్రింద ఆసుపత్రులకు కావాల్సిన సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన సదుపాయాలను కల్పించడం పై తాను దృష్టి సారించినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను, సిబ్బందిని సమర్థంగా వినియోగించుకుంటూ రోగులకు మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షించాల్సిన భాద్యత సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్ లదే అని కలెక్టరు స్పష్టం చేసారు.
పద్ధతి సరిగా లేని సిబ్బంది పై చర్యలు తెసుకోవాలని వారిని ఆదేశించారు. “విధులు నిర్వహించకుండా ఆసుపత్రికి వచ్చాము ఎఫ్ ఆర్ ఎస్ వేసి వెళ్లిపోతాము అనే ధోరణితో ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వండి. అయినా పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ మీరు ఊరుకోవద్దు. పై స్థాయి అధికారులనే ధిక్కరించే స్తాయిలో సిబ్బంది వుంటే మీరేం చేస్తున్నట్లు? ఇలాంటి వారి వల్ల మొత్తం వ్యవస్తే గాడి తప్పే అవకాశం ఉంది. ఇర్రెగ్యులర్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోండి” అని కలెక్టరు దిశా నిర్దేశం చేసారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం సహించబోనని ఆమె హెచ్చరించారు.
ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ శ్రీనివాస్ నాయక్, డి ఎం హెచ్ ఓ టి. వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్ హేమంత్, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

