హైదరాబాద్ మే 17 జేఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ డివిజన్‌లోని వరంగల్, పెద్దపల్లి మరియు కరీంనగర్ రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ మరియు ప్రధాన కార్యాలయం మరియు డివిజన్ నుండి ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. అమృత్ భారత స్టేషన్
పథకం(ఏ.బి.ఎస్.ఎస్.) లో భాగంగా రూ. 25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు . దీనిలో ఆయన కొత్తగా అభివృద్ధి చేసిన ప్రయాణీకుల సౌకర్యాలు, స్టేషన్ ఆస్తులు, కొత్తగా నిర్మించిన 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (ఎ.టి. వి.ఎంలు), బుకింగ్ కార్యాలయం, స్టేషన్ ముఖద్వారం మరియు సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ను సురక్షితంగా, సులభతరంగా నియంత్రించడానికి అనుసరించాల్సిన భద్రతా చర్యలపై కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ భవనం శుభ్రత మరియు స్టేషన్ ఆస్తుల నిర్వహణపై దృష్టి పెట్టాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ తనిఖీలో ప్రయాణీకుల సౌకర్యాలు, వసతులు , స్టేషన్ మాస్టర్ కార్యాలయం మరియు సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని ఆయన సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ. 26.49 కోట్ల వ్యయంతో పెద్దపల్లి స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. రైలు అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి ప్రజా ప్రతినిధుల నుండి జనరల్ మేనేజర్ వినతి పత్రాలను స్వీకరించారు.
రూ. 25.85 కోట్ల వ్యయంతో అమృత్ స్టేషన్‌గా పునరాభివృద్ధి చేయబడిన కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిలో ప్రయాణీకుల సౌకర్యాలు, స్టేషన్ వెయిటింగ్ హాల్ ప్రాంతం, బుకింగ్ ఆఫీస్, ప్లాట్‌ఫామ్‌లపై ఎస్కలేటర్ మరియు తాగునీటి సౌకర్యాల పనితీరు, స్టేషన్ ముఖభాగం మరియు సర్క్యులేటింగ్ ప్రాంతం మొదలైన వాటిని ఆయన తనిఖీ చేశారు. రైలు అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి ప్రజా ప్రతినిధుల నుండి జనరల్ మేనేజర్ వినతి పత్రాలను స్వీకరించారు.



