చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 5 గంటలకు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహప్రవేశానికి హాజరయ్యారు.
రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివపురం, పీఈఎస్ వెద్య కళాశాలతో పాటు వి.కోట -కుప్పం జాతీయ రహదారిలో బలగాలను మోహరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు. కుప్పంలో సొంతిల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ గృహప్రవేశం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల మధ్య జరిగిన శుభకార్యం తనకు ఎప్పటికి గుర్తుండిపోతుందని తెలిపారు.
36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రజల ఆశీస్సుల మధ్య కార్యక్రమం జరగడం మరచిపోలేమని లోకేశ్ పేర్కొన్నారు. సొంతింటి పండుగలా తరలివచ్చిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత మరువలేనిదని చెప్పారు. ఇది తమ కుటుంబ పండుగ కాదని అందరి పండుగన్నారు. ప్రతి అడుగులో తమ కుటుంబానికి తోడుగా ఉన్న అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలని తెలియజేశారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు దీవెనగా నిలుస్తాయని లోకేశ్ ట్వీట్చేశారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన అతిథులు, నేతలు, కార్యకర్తలకు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు.
