వినూత్న ఆలోచనలను అమలు చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయంతో స్మార్ట్ వర్క్ చేయటం ద్వారా నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. నియోజక వర్గాలు
మరియు జిల్లాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ల రూపకల్పనపై సోమవారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, మేయర్ గంగాడ సుజాత హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… పి-4, రాజధాని అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, నిధుల మళ్లింపు వలన గత ప్రభుత్వంలో స్తంభించిన కేంద్ర ప్రభుత్వ పథకాలను స్ట్రీమ్ లైన్ చేశామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక అంశాలు, వనరులు, స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందేలా దృష్టి సారిచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగానే ప్రజలను, ప్రజాప్రతినిధులను, ప్రైవేటు సంస్థలను, ఇతర ప్రముఖులను భాగస్వాములను చేస్తూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్లు రూపొందించేలా దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. పరిపాలనలో సాంకేతికతకు పెద్దపేట వేసామన్నారు. స్మార్ట్ వర్క్ చేస్తూ నియోజకవర్గాలు, జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా సమన్వయంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు 15% వృద్ధిరేటు లక్ష్యంగా కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభిస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తామని, తలసరి ఆదాయాన్ని ప్రతి ఏడాది సమీక్షిస్తూ జిల్లాల అభివృద్ధికి నిర్దేశాలు మారుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, సిపిఓ వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

