ప్రకాశం జిల్లాలో చెంచు హాబిటేషన్స్ లో ఈనెల 15 నుండి 30 వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ధర్తి అబా అభియాన్ అవగాహన మరియు ప్రయోజన సంతృప్తి శిబిరాలను నిర్వహించి ఆ చెంచు హాబిటేషన్స్ లో నివసిస్తున్న చెంచుల జీవనస్థితిగతులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వర్చువల్ గా ఐటిడిఏ పిఓ, విద్య, వైద్య, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ, ఆర్ డబ్ల్యూ ఎస్, జిల్లా ఐటిడబ్ల్యుఓ తదితర శాఖల అధికారులతో సమావేశమై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిధిలోని చెంచు హాబిటేషన్స్ లో ఈ నెల 15వ తేదీ నుండి 30 వతేదీ వరకుధర్తి అబా అభియాన్ అవగాహన మరియు ప్రయోజన సంతృప్తి శిబిరాలను నిర్వహించి చెంచుల జీవన పరిస్థితులను అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయుటకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ నెల 15వ తేదీ నుండి 30 తేదీ వరకు రోజుకొక హాబిటేషన్ లో సంబంధిత శాఖల అధికారులు గ్రామ సభలు నిర్వహించి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాల అమలు తీరును, వారి అవసరాలను అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో శాఖా పరంగా హాబిటేషన్ వారీగా నివేదికలు తయారు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్, శ్రీశైలం చెంచు ప్రాజెక్ట్ పి ఓ ను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఐ టి డి ఏ అధికారి వరలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బాల శంకర రావు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, పంచాయతీ రాజ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

