వైద్య ప‌రిశోధ‌న‌ల‌పై వినూత్న వ‌ర్క్‌షాప్‌ – కిమ్స్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో రెండు రోజులు నిర్వ‌హ‌ణ‌ -ప‌రిశోధ‌న‌ల ప్ర‌చుర‌ణ‌.. దాని తీరుతెన్నుల‌పై శిక్ష‌ణ‌ – రెండు తెలుగురాష్ట్రాల నుంచి భారీగా వ‌చ్చిన వైద్యులు

(జె ఎస్ డి ఎం న్యూస్) హైద‌రాబాద్, జూన్ 14: వివిధ వైద్య విధానాలు అవ‌లంబిస్తూ రోగుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త చికిత్స‌లు అందించ‌డంతో పాటు.. తాము చేసిన చికిత్స‌లు ఫ‌లించిన‌ప్పుడు ఆ వివ‌రాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఇత‌ర వైద్యుల‌కు తెలియ‌జేయ‌డం కూడా చాలా ముఖ్య‌మ‌ని, అప్పుడే వైద్య విజ్ఞానం మ‌రింత మెరుగుప‌డుతుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు అన్నారు. అసోసియేష‌న్ ఆఫ్ నాన్ ఇన్వేజివ్ న్యూర‌ల్ స్టిమ్యులేష‌న్స్‌తో క‌లిసి కిమ్స్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రెండు రోజుల వ‌ర్క్‌షాప్‌ను ఆయ‌న ప్రారంభించారు. వైద్యం, ఫిజియోథెర‌పీతో పున‌రావాసం లాంటి రంగాల్లో ప‌రిశోధ‌న‌ల మీద ఈ వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఇందులో సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్, న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ, “సాధార‌ణంగా వైద్య‌రంగంలో ఉన్న‌వారంద‌రూ పుస్త‌కాల్లో చ‌దువుకుని, సీనియ‌ర్ల వ‌ద్ద నుంచి నేర్చుకుని వాటిని అమ‌లుచేస్తారు. కానీ ఇక్క‌డ మాత్రం ప‌రిశోధ‌న‌ల ద్వారా ల‌భించిన సాక్ష్యాల నుంచి ఎలా నేర్చుకోవాల‌న్న విష‌యాన్ని మీరు నేర్చుకుంటారు. దాన్ని మీ మీ రంగాల్లో అమ‌లుచేయ‌డం, మీరు కూడా మ‌రిన్ని ప‌రిశోధ‌న ప‌త్రాలు ప్ర‌చురించ‌డం ద్వారా మ‌రింత‌మంది వైద్యుల‌కు మీరు చేసిన ప‌రిశోధ‌న‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి” అని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కిమ్స్ ఆస్ప‌త్రుల న్యూరో రీహాబిలిటేష‌న్ విభాగాధిప‌తి, వ‌ర్క్‌షాప్ ఆర్గ‌నైజింగ్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ అజ‌య్ కుమార్ మిద్దె మాట్లాడుతూ, “ప్రాక్టీస్ స‌మయంలో కొన్ని కొత్త విష‌యాలు తెలుస్తాయి. వాటితో పాటు మ‌న అనుభ‌వాన్ని బ‌ట్టి కొన్ని కొత్త టెక్నిక్‌లు కూడా రోగుల మీద చేస్తాం. ఇవి విజ‌య‌వంతం అయిన‌ప్పుడు ఆ వివ‌రాల‌ను కొన్ని వైద్య ప‌త్రిక‌ల‌లో ప్ర‌చురిస్తాం. దానివ‌ల్ల మ‌నం చేసిన విజ‌య‌వంత‌మైన విధానాలు అంద‌రికీ తెలుస్తాయి. దాంతో వాళ్లు కూడా త‌మ క్లినిక‌ల్ ప్రాక్టీసు మెరుగుప‌రుచుకుంటారు. మామూలుగా అయితే సీనియ‌ర్లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన జూనియ‌ర్ల‌కు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌రు, లేదా త‌మ ఆస్ప‌త్రిలో ఉన్న మిగిలిన‌వాళ్ల‌కు చెప్ప‌గ‌ల‌రు. అంతేత‌ప్ప ఎక్క‌డో దూరంగా ఉన్న‌వాళ్ల‌కు చెప్ప‌లేరు. మ‌న ప‌రిశోధ‌న వివ‌రాల‌ను వైద్య ప‌త్రిక‌ల్లో ప్ర‌చురించిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ ప‌రిశోధ‌న విష‌యాలు, వివ‌రాలు తెలుస్తాయి. అది ఎలా ప‌నిచేసిందో అర్థ‌మ‌వుతుంది. దాన్ని త‌మ వ‌ద్ద కూడా వాళ్లు అమ‌లుచేసి చూడ‌గ‌ల‌రు. అస‌లు ఒక వైద్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ను ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా న‌యం చేయాలి, దాని మీద ఎలా ఒక పేప‌ర్ రాసి, దాన్ని ప్ర‌చుర‌ణ‌కు ఎలా పంపించాలి అనే విష‌యాలు కూడా ఇందులో పాల్గొన్న వైద్యులంద‌రికీ వివ‌రంగా తెలియ‌జేశాం. ఇది దేశంలో చాలా విభిన్న‌మైన‌ది. తొలిసారి కిమ్స్ ఆస్ప‌త్రిలో నిర్వ‌హించారు. ముఖ్యంగా రీహాబిలిటేష‌న్ రంగంలో సాక్ష్యాల ఆధారంగా ప‌నిచేయ‌డం చాలా ముఖ్యం. దీని ద్వారా సాక్ష్యాల ఆధారంగా వైద్యం చేసే విధానాన్ని మెరుగుప‌రిచిన‌ట్ల‌యింది. అవ‌గాహ‌న పెంచేందుకు, సాక్ష్యాల ఆధారంగా ప‌నిచేసేలా వైద్యుల‌ను ప్రోత్స‌హించేందుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతోపాటు రోగుల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి వీలు కుదిరింది” అని తెలిపారు.

ఈ స‌ద‌స్సుకు రిసోర్స్ ప‌ర్స‌న్‌గా కింగ్ ఖాలిద్ యూనివ‌ర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ తెడ్ల వ్య‌వ‌హ‌రించారు. సీనియ‌ర్ న్యూరో ఫిజియోథెర‌పిస్ట్ డాక్ట‌ర్ సిద్ధార్థ్ గంటాయ‌త్ ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీగా స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చూసుకున్నారు. స‌ద‌స్సులో ప్ర‌ధానంగా అస‌లు ప‌రిశోధ‌న‌కు అంశాలు ఎలా ఎన్నుకోవాలి, వాటిపై తాము గ‌మ‌నించిన వివ‌రాల‌ను ఎలా గుదిగుచ్చి రాయాలి, ప్ర‌చుర‌ణ‌కు ఎలా పంపాలి, ప్ర‌చుర‌ణ‌కు ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేంటి అనే వివ‌రాల‌న్నింటినీ వైద్యుల‌కు వివ‌రించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్య‌లో ప‌లువురు వైద్యులు దీనికి హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *