ప్రకాశం జిల్లా ను నాటుసారా రహిత జిల్లాగా ఈ రోజు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని, దీనికి కృషి చేసిన సంబంధిత శాఖల అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
గురువారం ఒంగోలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం “నవోదయం 2.0” పై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తో కలిసి జిల్లాస్ధాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా ను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటిస్తూ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… ఈ సంవత్సరం ఫిబ్రవరి 19న రాష్ట్ర స్థాయి “నవోదయం 2.0” కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించుకుని ప్రకాశం జిల్లాను నాటు సారా రహిత జిల్లా గా మార్చేందుకు సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యు, అటవీ శాఖల అధికారుల సహకారంతో ఈ నాలుగు నెలల కాలంలో జిల్లాలో నాటు సారా తయారుదారులను, వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వారిలో అవగాహన కల్పించడం, నాటుసారా యూనిట్స్ ను నిర్మూలన చేయడం వంటి చర్యలు తీసుకోవడం వలన ఈ రోజు ప్రకాశం జిల్లా ను నాటు సారా రహిత జిల్లా గా ప్రకటించడానికి అవకాశం కలిగిందని, దీనికి కృషి చేసిన సంబంధిత శాఖల అధికారులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రత్యేక అభినందనలు తెలియచేసారు. ఒక సారి ప్రకాశం జిల్లా ను నాటు సారా రహిత జిల్లా గా ప్రకటించిన తరువాత, జిల్లా లో ఎక్కడా నాటు సారా తయారీ, వినియోగం జరగకుండా నిరంతరం మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులనుఆదేశించారు. జిల్లాలో ఐడి లిక్కర్ పీడిత గ్రామాల జాబితాను 8 మండలాల్లో ఎ.బి.సి. కేటగిరి లుగా విభజించడం జరిగిందని, ఎ కేటగిరిలో 2 గ్రామాలు, బి కేటగిరిలో 27 గ్రామాలు, సి కేటగిరిలో 6 గ్రామాలను మొత్తం 35 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో నాటుసారాను నిర్మూలించి ప్రభుత్వ లక్ష్యం చేరుకునేలా పనిచేయాలన్నారు. ఆ వృత్తి నుండి వారి కుటుంబాలను దూరం చేసి సమాజంలో గౌరవప్రదమైన ఉపాధి మార్గాలను వారికి కల్పించేలా ప్రభుత్వం కల్పించే సంబంధిత రాయితీలను, పధకాలను వారికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా ఎస్పి ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ…. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరియు నెస్ట్ జనరేషన్ ఈ వృత్తిలో కొనసాగకుండా జిల్లాలో నాటుసారా తయారీ మరియు సరఫరాను పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా లో నాటుసారాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో పూర్తీ సహకారం అందిస్తుందని, నేడు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్స్ అందుబాటులో వున్నాయని, ముఖ్యంగా మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లో డ్రోన్స్ సహకారంతో వారిని గుర్తించి నాటుసారాను అరికట్టుటకు అవకాసం ఉంటుందని, దీనికి తమ శాఖ తరపున పూర్తీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఎస్.పి తెలిపారు.
అనంతరం నవోదయం 2.0 పై అవగాహన కలిగించే కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమీషనర్ దయాసాగర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం, డిఆర్డిఎ పిడి నారాయణ, జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ సిఐలు, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.


