వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో పంటల ఎదుగుదల పెద్దగా ఉండదని నీటి యాజమాన్యలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు మండలంలో బుధవారం తురకపాలెం, మన్నేపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ఆరుద్ర కార్తెలో ‘అడ్డెడు పోస్తే పెట్టెడు పండుతాయని ‘ గతంలో పెద్దల సామేత ఉందని కాని నేడు వాతావరణ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేదని చెప్పారు. మే నెలలో సాధారణ వర్షపాతం 62.8 మి.మీలు కాగా పది రోజుల పాటు 154.9 మి.మీలు వర్షపాతం నమోదు అయినదని అన్నారు. జూన్ నెలలో 64 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సరియైన వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు. పైగా ఎత్తు గాలుల వలన నీరు పొలాలలో పెట్టిన పది రోజులు ఉండాల్సిన తేమ కేవలం మూడు రోజుల్లో ఆవిరై పోతుందని చెప్పారు. రైతు నీటి యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నారు మడుల్లో గాని నాట్లు వేసిన పొలాలో గాని ఖచ్చితంగా 3 సెం.మీల మేర నీరు ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.
