వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన కుటుంబాలను దత్తత తీసు కొన్న జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా -పి-4 కార్యక్రమంలో’మార్గదర్శి’గా నిలిచిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయడంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రత్యేక 'మార్గదర్శి'గా నిలిచారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన కుటుంబాలను తాను దత్తత తీసుకొని ఈ పథకం కింద వారికి 'మార్గదర్శి'గా ఉండాలని నిర్ణయించారు. మార్గదర్శిగా ఉండటంలోనూ, మార్గదర్శకులను గుర్తించడంలోనూ తీసుకోవలసిన చర్యలపై గురువారం ప్రకాశం భవనం నుంచి మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో ఆమె ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ...జిల్లాలో 74 వేలకుపైగా ' బంగారు కుటుంబా'లను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే ' మార్గదర్శకుల'ను కూడా త్వరగా గుర్తించాలన్నారు. సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో పొందుపరచాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే ఎన్.ఆర్.ఐ.లు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చని, ఈ విషయంలో పరిమితి ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా హోదాతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న అందరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆమె చెప్పారు. సదరు ఉద్యోగి / అధికారి బదిలీ అయినప్పటికీ ఆ హోదాలోకి వచ్చినవారు ఆయా కుటుంబాల యోగక్షేమాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మార్గదర్శకులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో తాను సమావేశం నిర్వహిస్తానన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ఈ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ప్రతి వారం సమీక్షిస్తానని కలెక్టర్ ప్రకటించారు. కాగా ఈ వెబ్ సైటులో బంగారు కుటుంబం, మార్గదర్శకుల వివరాలను ఏవిధంగా నమోదు చేయాలో జెడ్పి సీఈవో చిరంజీవి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. వర్షాలు ప్రారంభమైనందున పారిశుద్ధ్యము, సురక్షిత తాగునీటి సరఫరా తదితర అంశాలకు గ్రామాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డి సి హెచ్ ఎస్ శ్రీనివాస నాయక్, డీఎస్ఓ పద్మశ్రీ, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, డిఆర్డిఏ పిడి నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకర్రావు, జిల్లా బిసి సక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్.ఈ..వరలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.