క్షణికానందం కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతూ, ఎంతో మంది యువత మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి, తమ భవిష్యత్తును స్వయంగా నాశనం చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం మరియు ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించేందుకు, రైళ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసులు, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ అధికారులు మరియు సిబ్బందితో కలిసి గురువారం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
ఆకస్మికంగా సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం టు కోల్లం ఎక్స్‌ప్రెస్ రైలులో కొంత దూరం ప్రయాణించి భోగిలను విస్తృత తనిఖీలు నిర్వహించారు.
స్థానిక పోలీసులు, ఈగిల్ టీం, రైల్వే పోలీసులు, మాదకద్రవ్యాలు గుర్తించే పోలీస్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది కలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ సర్వీస్ సెంటర్లు, బోగీలు మరియు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్‌ను అణువణువునా ముమ్మరంగా తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ… ప్రకాశం జిల్లా పోలీసులు, ఈగిల్ టీం, జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రకాశం జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తయారు చేయడమే తమ లక్ష్యమని, అందుకోసం పోలీసులు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. యువతపై మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా ఉండేందుకు, ప్రతి కాలేజ్ మరియు పాఠశాలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే మాదక ద్రవ్యాలు,గంజాయి నియంత్రణ దిశగా అలవాటు పడిన వారిని డి – అడిక్షన్ సెంటర్లో చేర్పించడం, సరఫరా చేస్తున్న వారిని గుర్తించడం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇకపై ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పార్సెల్ సర్వీస్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. అక్రమ మాదకద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. డ్రగ్స్ పై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972, స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112 కు లేదా పోలీసు వాట్సాప్ నంబరు 9121102266 కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని కోరారు.
ఈ తనిఖీలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి రాఘవేంద్ర, మహిళా పియస్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, జి ఆర్ పి ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కొండయ్య,ఈగల్ టీం, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



