ప్రకాశం జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తా – రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్

ప్రకాశం జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు పూర్తయ్యేలా తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పారు.సంవృద్ధిగా నీరు
వుండి, వలసలు లేని ప్రకాశం జిల్లాను తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రూ.1290 కోట్లతో ఈ పధకం కింద చేపట్టే పనులకు శుక్రవారం మార్కాపురo లో ఆయనఅ జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఉప ముఖ్యమంత్రి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
“ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు . సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని కాల్చుకోండి అని ధైర్యంగా గుండెలు చూపించిన ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు . ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నింపారు. అలాంటి మహానుభావులు పుట్టిన నేల ఇది. ఇలాంటి నేల చాలా నిర్లక్ష్యానికి గురయిందని ఇక్కడ యువతలో ఆవేదన ఉంది. దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని, చుక్క తాగునీరు లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోయాయని, ఉపాధి కోసం లక్షలాది మంది వలసలు వెళ్లిపోవల్సి వస్తుందని యువత ఆవేదన చెందుతున్నారు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాం కనుకే ప్రకాశం జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతి భారీ మంచినీటి ప్రాజెక్టు రూ. 1290 కోట్లతో జల్ జీవన్ పనులు ప్రారంభిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. పశు సంపదకు కూడా నీరు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వాటికి కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించే కార్యక్రమం చేపట్టాము.
• వైసీపీ దెబ్బకు జల్ జీవన్ మిషన్ నిలిచిపోయేది
జల్ జీవన్ మిషన్ పథకం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్. దేశంలో ప్రతి ఒక్కరి గొంతు తడపాలన్నదే ఆయన ఆకాంక్ష. ఈ పథకం కింద గత ప్రభుత్వానికి 2019- 24 మధ్య రూ. 26 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే… కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు. ఖర్చు చేసిన సొమ్ముతో ఏ ఒక్కరి దాహం తీర్చలేదు. కేవలం పైపులు వేసి చేతులు దులుపుకొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ మీద పథకం మీద సమీక్షించినప్పుడు పథకం గడుపు తీరిపోతుందని, కేంద్రం కూడా పథకం అమలు తీరుపై అసంతృప్తిగా ఉందని తెలిసింది. అద్భుతమైన ఈ పథకం ఉపయోగించుకుంటే రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చూడవచ్చనే అభిప్రాయంతో జలజీవన్ మిషన్ పథకం గురించి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారితో పలుమార్లు నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి కూడా విన్నవించాం. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్రంలో రూ. 84 వేల కోట్లు అవసరం అవుతుందని, పథకం గడువు పెంచాలని విన్నవించాం.
ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టే… ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల వల్లనే మళ్లీ పథకానికి పునరుజ్జీవం తీసుకొచ్చాం. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో మొదట విడత పనులకు శంకుస్థాపన చేశాం. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
• 10 లక్షల మందికి దాహం తీర్చవచ్చు
ఈ ప్రాజెక్టు దాదాపు 20 నెలల్లో పూర్తవుతుంది. ప్రాజెక్టు పూర్తయితే ఎర్రగొండపాలెం, ఒంగోలు, కనిగిరి, కొండపి, గిద్దటూరు, దర్శి, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాలు, 578కు పైగా గ్రామాల్లో తాగు నీటి సమస్యను తీర్చవచ్చు. మొదటి దశలో ఈ ప్రాజెక్టు కింద ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్‌హెడ్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 5 వేల కిలోమీటర్ల పైపు లైన్ల ద్వారా సుమారు 10 లక్షల మంది జనాభాకు వచ్చే 30 సంవత్సరాలపాటు తాగు నీటి సమస్య లేకుండా చూడొచ్చు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని రాపిడ్ శాండ్ ఫిల్టర్లతో శుద్ధి చేసి, పైప్‌ లైన్‌ల ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించవచ్చు. దీని ద్వారా పశ్చిమ ప్రకాశంలోని చాలా ప్రాంతాలకు ఫ్లోరైడ్ సమస్య లేని మంచి నీరు అందుతుంది.
• వైసీపీ శిలా ఫలకం వేసి మమ అనిపించింది
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఎన్నికల ముందు వైసీపీ స్టంట్ చేసింది. శిలా ఫలకం వేసి మమ అనిపించింది. 2024 తరువాత లక్షల కోట్ల అప్పులు మిగిల్చి దిగిపోయింది. 2024లో 21 మంది ఎంపీలను కూటమికి గెలిపించడం రాష్ట్రానికి అది వరం అయింది. కేంద్రం నుంచి అవసరమైన పనులు, పథకాలు రావడానికి ఇది కారణం. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కూడా ప్రణాళికబద్ధంగా అమలు చేస్తున్నాం. 18 నుంచి 20 నెలల్లో సక్రమంగా పనులను పూర్తి చేస్తాం. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ జరగాలి. ఉపాధి మెండుగా ఉండాలి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల వలసలు లేని, సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లా కల సాకారం అవుతుంది. సుస్థిరమైన 15 ఏళ్లపాటు పాలించే ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమవుతుంది. నేను అందుకే ప్రతిసారి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతాను.
వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలు చేసిన వాళ్లం. కడుపు కాలినవాడికి, కష్టపడి పని చేద్దాము అనుకున్నవాడికి కోపం తెప్పించకూడదు. అలా మేమూ రాష్ట్రం కోసం పని చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పాల్సిన విధంగా చెప్పండి. వాటిని సరిదిద్దుకుంటాం. లోపాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి. వాటిని సరిదిద్దుతాం. అంతేకానీ ఇష్టానుసారం – రంపాలు తెస్తాం.. కుత్తుకలు కోస్తాము అంటే సహించేది లేదు. నేనూ సినిమావాడినే… సినిమాలో డైలాగులు కేవలం ప్రేక్షకుల వినోదం కోసం మాత్రమే బాగుంటాయి. వాటిని సమాజంలో సగటు మనిషిని భయభ్రాంతులకు గురి చేసేలా ఉపయోగిస్తే మాత్రం చర్యలు తప్పవు.
• దేవుడి భూముల జోలికి రావొద్దు
చారిత్రక నేపథ్యం ఉన్న మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి ఆలయం భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న విషయం నా దృష్టికి వచ్చింది. వైసీపీ హయాంలో భూ దోపిడి హద్దులన్నీ దాటేసింది. దేవాలయాల భూములు, అటవీ భూములు, ఖాళీ భూములు.. ఇలా ఎక్కడ ఖాళీ భూమి కనబడితే అక్కడ వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయి ఆక్రమించేశారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తుంది. ఆక్రమణకు గురైన దేవాలయాల భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. దేవాలయాల భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
• కూటమి ప్రభుత్వం అంటే పిడికిలికి ఉన్న శక్తి
ఇంట్లో తల్లిదండ్రులు తిట్టుకొని నిద్రలేస్తే … పిల్లలు కొట్టుకొని నిద్రలేస్తారు అంటారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు నిరంతరం సమన్వయంగా పని చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ మన మధ్య ఎల్లప్పుడు ఏదో ఒక ఘర్షణ నింపాలని చూస్తోంది. చిన్న విషయాలను పెద్దవి చేసి చూడకండి. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరంతరం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వాలి.
ప్రధాని నరేంద్ర మోడీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, నాకు ప్రభుత్వ స్థాపనకు ఎవరూ ఎలా కష్టపడ్డారో, ఇప్పుడు ఎలా కష్టపడుతున్నారో … కూటమి ఐక్యత కోసం ఎలా పాటుపడుతున్నారో తెలుసు. ఆ విషయంలో మాకు స్పష్టత ఉంది. కూటమిలో మూడు పార్టీల్లో ఎవరూ ఎక్కువ కాదు… ఎవరూ తక్కువ కాదు. 2024కు ముందు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి నైతికంగా అండగా నిలబడ్డాం. ఆ పార్టీ బలం గొప్పదని చెప్పగలిగాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారికి అండగా నిలిచాం. మేము ఎప్పుడూ ఏ పార్టీని తగ్గించలేదు. జల్ జీవన్ మిషన్ కు ఇంతటి నిధులు వస్తున్నాయంటే బీజేపీ కారణం. రాష్ట్ర ఆర్థిక నిర్వహణను ఇంత సమర్థంగా నిర్వహించడం అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కే సాధ్యం. ప్రజల గురించి పోరాటం చేయడం నాకు తెలిసిన పని. ఇలా అంతా కలిస్తేనే పిడికిలి అవుతుంది. ఆ పిడికిలికి ఉన్న శక్తి అపారం. కూటమిలోని నాయకుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాట్లాడుకొని ముందుకు వెళ్లాలి. ప్రజలందరికీ దాహం తీర్చే అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… గుంటూరు, కర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను సమకూర్చి దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లాను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో అన్నీ ప్రాంతాలు నాటి నుండి నేటి వరకు వెనుకబడిన ప్రాంతాలని, అలాగే దాహార్తికి ఎదురుచూస్తున్న ప్రాంతాలని అన్నారు. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర విభజన సమయంలో చెప్పడం జరిగిదన్నారు. ఈ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తీ అయితే ఈ జిల్లా లోని అన్నీ ప్రాంతాల్లో ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలమౌతుందని మంత్రి తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లాతో పాటు ప్రక్కన నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలకు కుడా సాగునీరు, త్రాగు నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనతో వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించడం జరిగిందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే, గత ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందన్నారు. నేడు ప్రకాశం జిల్లాలలో 578 పశ్చిమ ప్రాంత ఆవాసాలకు రక్షితనీటి సరఫరా చేయుటకు 1290.00 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు శంఖుస్థాపనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రావడం ఎంతో సంతోషదాయకమన్నారు. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తున్నదన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి మాట్లాడుతూ.. పశ్చిమ ప్రకాశం ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2018కి ముందే నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ త్రాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రూ. 650 కోట్లు కేటాయించిందని, 2019 లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు ఈ ప్రాజెక్టు వ్యయం నేడు రూ.1290 కోట్లకు పెరిగిందన్నారు. ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో రూ.165 కోట్లతో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మాణం చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతిలోకి సేవలందిస్తున్నామని, ఇచ్చిన మాటకు ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు ఫేజ్ 2 కింద తూర్పు ప్రకాశం ప్రాంతానికి కూడా త్రాగునీరు అందించాలని ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరడమైనది.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ… గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి జలజీవన్ మిషన్ పథకం కింద రూ.60 వేల కోట్లను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని మరో రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడిగించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రధానమంత్రితోనూ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రితోనూ మాట్లాడి ఆ మేరకు సఫలీకృతులైనట్లు చెప్పారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు కేటాయించి అమలు చేసే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద పనులు చేపట్టేందుకు ఉపముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేయటం సంతోషకరమన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో విడతను కూడా ఈ పథకం కింద చేపట్టేలా ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాపై, ప్రధానంగా పశ్చిమ ప్రాంతముపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుండడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిపైనా దృష్టి సారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. తాజాగా రూ.1290 కోట్లతో పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు అవసరమైన పనులకు శంకుస్థాపన చేయటం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నట్లు చేప్పారు.
ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా నీటి ఎద్దడి కలిగిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని, ముఖ్యంగా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతాలలో తీవ్రమైన త్రాగు నీటి కొరత ఉందని, ఈ త్రాగునీటి సమస్యలకు స్వల్పకాలిక పరిష్కారంగా గత రెండు దశాబ్దాలుగా త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా దాదాపు 70 శాతం ఆవాసాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ తీవ్ర త్రాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థిరమైన నీటి వనరులైన వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ జలాశయాల నుండి శుద్ధిచేసిన త్రాగునీటిని సరఫరా చేయడానికి నిర్దేశిస్తూ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెలిగొండ జలాశయం నీటిని పెద్ద మొత్తంలో శుద్ధిచేసి జిల్లాలోని 7 నియోజక వర్గాలలో 1386 ఆవాసములకు ఇంటింటికి కుళాయిల ద్వారా సరఫరా చేయడం కొరకు ప్రతిపాదించిందన్నారు. మొదటి దశలో భాగంగా రూ 1290.00 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలలో 578 పశ్చిమ ప్రాంత ఆవాసాలకు రక్షితనీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు. నల్లమల సాగర్ (పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్) జలాశయం నుండి కృష్ణా నది నీటిని రాపిడ్ సాండ్ ఫిల్టర్లచే శుద్ధి చేసి పైప్ లైన్ల ఏర్పాటుచేసి ఇంటింటికీ కుళాయిల ద్వారా త్రాగు నీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి మరియు కందుకూరు శాసన సభ నియోజక వర్గాల ప్రజలకు సగటున ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్ల సురక్షిత త్రాగు నీరు సరఫరా చేయడం జరుగుతుంది. పథకం నిర్మాణం పూర్తి చేసిన తరువాత 12 సంవత్సరాలు వరకు నిర్వహణ బాధ్యతలు నిర్మాణ ఏజెన్సీ నిర్వహించెదరని తెలిపారు. ఈ పద్ధకంలో భాగంగా ఇప్పటికే ఉన్న 77,663 కుళాయిలతో పాటు కొత్తగా 59,603 కుళాయిలను ఏర్పాటుచేసి దాదాపు 1,37,266 ఇళ్ల కు మంచి నీటి ని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పధకం ద్వారా 6.73 లక్షల మంది ప్రజలకు నీటి సమస్య తీరనున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టు లో భాగంగా 140 ఎమ్. ఎల్. డి రాపిడ్ సాండ్ ఫిల్టర్లను గొట్టిపడియ వద్ద నిర్మాణం చేస్తున్నారు. 31 మంచి నీటి సరఫరా క్రమబద్దించే మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకల నిర్మాణం చేయబోతున్నారు. అదే విధంగా మరో 334 మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకులను గ్రామాల్లో నిర్మాణం చేయబోతున్నారు. దాదాపు 4866 కి. మీ పొడవు మంచి నీటి పైపు లైన్లు నిర్మాణం చేయనున్నారు. వచ్చే 24 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జారికి అంకితం చేయనున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా జలజీవన్ మిషంలో భాగంగా ఇప్పటివరకు 1546 పనులను రూ. 1601 కోట్ల వ్యయంతో గుర్తించి, 1086 పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన 460 పనులు వివిధ దశలలో ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 4,27,056 గృహాలకు ఇంటింటికి కుళాయి ద్వారా నీటిని పంపిణీ చేయనున్నారని ఇన్ చార్జి కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, ఎస్ ఎన్ పాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ కుమార్, బి ఎన్ విజయకుమార్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్, ఎపి మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా విజయకుమార్, పంచాయతి రాజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శశి భూషణ్, ఆ శాఖ కమిషన్ కృష్ణ తేజ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *