వివిధ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో పటిష్ట భద్రత మధ్య పరీక్షలు జరుగుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు తెలిపారు. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకూ ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జిల్లావ్యాప్తంగా ఆరు సెంటర్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా రెండో రోజైన బుధవారం రెండు సెంటర్లలో పరీక్షలు జరిగాయి. ఒంగోలు నగరం మామిడిపాలెంలోని
నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కాలేజీలో ఉదయం పరీక్షకు 170కు గాను 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 135 కి గాను 62 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాన్ని డీఆర్వో సందర్శించారు. అదేవిధంగా ఒంగోలు నగరంలోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటరులో కూడా ఉదయం పూట పరీక్షలు జరిగాయి. ఇక్కడ 97కు గాను 41 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
