ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియం వేదికగా సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 43వ జాతీయ స్థాయి కరాటే పోటీలను ఆదివారం ప్రారంభమయ్యాయి.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, క్రమశిక్షణ మరియు ధైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం గర్వకారణమని అన్నారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ తరహా పోటీలు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు పరస్పర అవగాహనను, స్నేహాన్ని పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం సాధ్యమవుతుందన్నారు. ప్రకాశం జిల్లా తరఫున కరాటే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని కనబరిచి, ప్రకాశం జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు.
కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయ్ కృష్ణ, ఒంగోలు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు, కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరి మోహన్ రావు, ప్రతిభ విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు, మండవ మురళీకృష్ణ, మారేళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన అనేక మంది కరాటే కోచ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



