జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆమె చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా లభ్యత, భూగర్భ నీటిమట్టం పెంపు, ఈ.టీ.పీ.ఎస్, స్వమిత్వ పథకాల అమలులో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.
మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన స్థాయిలో యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్.ఎస్.కే. స్థాయిలో ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.
యూరియాలో 70% ఆర్.ఎస్.కే.లకు, 30% ప్రైవేటు షాపులకు ఇస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీపై అందించే యూరియాను ఇతర అవసరాలకు వినియోగించినా, యూరియా కొరతగా ఉందని పుకార్లు పుట్టించినా, అక్రమంగా నిల్వ ఉంచినా, అధిక ధరకు విక్రయించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్.ఎస్.కే.లు, ప్రైవేటు షాపులను తనిఖీ చేసేందుకు రెవెన్యూ, పోలీస్ , వ్యవసాయ శాఖ అధికారులతో మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినందున మంగళవారం నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజూ తనకు నివేదికలు పంపించాలని చెప్పారు.
వాన నీటిని ఒడిసి పట్టాలి ….
స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన పది ప్రాధాన్య అంశాలలో నీటి భద్రత కూడా ఒకటని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాన నీటిని
భూమిలోకి ఇంకింప చేయటంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ దిశగా గ్రామాల వారీగా నేటి సంరక్షణ ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. జిల్లాలో 93 గ్రామాలలో నిర్దేశిత పరిమితికి మించి భూగర్భనీటిని
వినియోగించినట్లు నిపుణులు గుర్తించారని ఆమె తెలిపారు. భూగర్భ నీటిమట్టాన్ని పెంచేందుకు తొలుత ఇంకుడు గుంతల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వాన నీటిని సంరక్షించుకోవడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే 11 వేలకు పైగా ఇంకుడు గుంతలను మంజూరు చేసామని, క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు రాగానే మరో 6 వేలకు పైగా మంజూరు చేస్తానన్నారు.
ప్రవర్తన బాగుండాలి ….
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించడంలోనూ, వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయడంలోనూ క్షేత్రస్థాయి ప్రభుత్వ సిబ్బంది ప్రవర్తన అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. హౌసింగ్ స్కీములో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం నిధులు జమ చేసిన విషయాన్ని కొందరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారికి తెలియజేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇతర పథకాల విషయంలోనూ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన సరిగా లేకపోతే సహించబోని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది ప్రవర్తనపై ఎంపీడీవోలు నిశిత పరిశీలన ఉంచాలని కలెక్టర్ చెప్పారు.





అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక పత్రాలను ఈ.టీ.పీ.ఏస్. వెబ్ సైట్ లో త్వరగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న స్వమిత్వ సర్వేను కూడా వేగవంతం చేయాలని చెప్పారు. భారీ వర్షాలు, తుఫాను సమయంలో ఉపయోగపడేలా తుఫాను షెల్టర్ కేంద్రాల మరమ్మతులపై ఇప్పటినుంచే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర విధులు నిర్వహించే విభాగాలు సంబంధిత శాఖల మార్గదర్శకాల ప్రకారం సన్నద్ధమై ఉండాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, జడ్పీ సీఈవో చిరంజీవి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డ్వామా పీ.డీ. జోసఫ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకరరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి నారాయణ, గ్రౌండ్ వాటర్ , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.