ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం. నాయక్ బుధవారం ఒంగోలు నగరంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల (బాలురు & బాలికల) వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సుమారు గంట పాటు ముఖాముఖిగా మాట్లాడి, విద్యా ప్రమాణాలు మరియు వసతి గృహాల్లో అందుతున్న సౌకర్యాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ఆత్మీయ సంభాషణ – కెరీర్ గైడెన్స్…
ముందుగా కళాశాల బాలుర వసతి గృహం-2ను సందర్శించిన ఆయన, అనంతరం జే.డి. శీలం భవనంలోని బాలికల వసతి గృహాలు 2 & 3 ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడుతూ… “మీరు గ్రామీణ ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. కష్టపడి చదవడమే కాకుండా, ఉన్నత లక్ష్యంతో (Career Guidance) ముందుకు సాగాలి. కేవలం డిగ్రీలతో ఆగిపోకుండా గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఐఏఎస్ అధికారులుగా సమాజానికి సేవ చేయాలి” అని వారిలో స్ఫూర్తిని నింపారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు తమ ఆశయాలను ప్రిన్సిపల్ సెక్రటరీ కి వివరించారు:
*ఈర్ల మల్లీశ్వరి (డిగ్రీ 2nd Year, BA):*
సబ్ ఇన్‌స్పెక్టర్ అవ్వడమే తన లక్ష్యమని తెలిపారు.
*జేస్టావతి హరిణి (డిగ్రీ 1st Year, BSc):* గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వివరించారు.
*పుచ్చకాయల నాగమల్లేశ్వరి (డిగ్రీ 1st Year): సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా స్థిరపడాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆశయాలను తెలుసుకున్న ఆయన, వారు రాసిన అసైన్‌మెంట్ నోట్స్ మరియు అకాడమిక్ రికార్డులను స్వయంగా పరిశీలించి వారిని అభినందించారు.
*సౌకర్యాల పరిశీలన – కొత్త నిర్ణయాలు:*
వసతి గృహాల్లోని వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించిన శ్రీ నాయక్ గారు, ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ మరియు పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపడుతూ ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు:
1. *డైనింగ్ హాల్ మెరుగుదల:* ఈ రెండు వసతి గృహాలకు అత్యాధునిక డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన అంచనాలను (Estimates) వెంటనే పంపాలని డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్. లక్ష్మా నాయక్ గారిని ఆదేశించారు.
2. *లైబ్రరీ ఏర్పాటు:* విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా లైబ్రరీ సదుపాయం కల్పిస్తామని హామీ ఇస్తూ, దీనిపై కూడా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి. అర్జున్ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి వరలక్ష్మి, ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ. రబియా బేగం హెచ్.డబ్ల్యూ.ఓలు శిరీష, శ్రీలత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




