ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్య క్రమం -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

 ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
చెప్పారు. శుక్రవారం ఆయన మర్రిపూడి మండలంలోని గుండ్ల సముద్రం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను ఓపికతో విని వాటి
పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా ముచ్చటించారు. గ్రామ అభివృద్ధిలో,  ప్రత్యేకంగా పారిశుధ్య నిర్వహణలో ప్రజల కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గ్రామ సమస్యలు ఇవీ…

👉 మండల పరిధిలో రెండు ప్రధాన చెరువులు ఉన్నాయి. ఈ రెండు చెరువులకు పూర్తి స్థాయిలో నీటిని నింపినట్లయితే మండల పరిధిలోని అన్నీ గ్రామాలకు తాగు, సాగునీటికి సమస్య ఉండదు.
అలాగే ఈ గ్రామంలో సైడు కాలువలను నిర్మించాల్సిన అవసరం ఉంది.

👉 ఈ సంవత్సరం కంది పంట దిగుబడి బాగా వచ్చింది. గోతాల కొరతతో కొనుగోలు కేంద్రంలో కందులు కొనుగోలు చేయడం ఆలస్యం అవుతోంది.

👉 గుండ్లసముద్రం గ్రామంలో పశువుల మేత పోరంబోకు భూములు చాలా వరకు ఆక్రమణకు గురికావడం జరిగింది. ఆ భూములను సంరక్షించి పేద ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.

👉 ఎస్ టి రాజుపాలెం లో సుమారు 40 కుటుంబాల ఎస్ టి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాము. కొద్ది పాటి వర్షాలు కురిసినా ఈ ప్రాంతం మునిగిపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. మా రోడ్డు ను మెరక చేసి రాక పోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి.

👉 నా పేరు అరుణ.  పెళ్లి అయి 12 సంవత్సరాలు అయింది. నా వివరాలు హౌస్ మ్యాపింగ్లో  మా తండ్రి వివరాలతో మ్యాపింగ్ అయినందున నా కుటుంబానికి తల్లికి వందనం వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు.

👉 మా గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించాలి.

👉 గ్రామంలో నీటి సరఫరా ఎప్పుడైనా ఆగినప్పుడు  సంబంధిత ట్యాంకు నుండి నీటిని తెచ్చుకునేలా అవసరమైన సౌకర్యం కల్పించాలి.

👉 గ్రామంలో స్మశాన వాటికకు వెళ్ళే దారిని సిమెంటు రోడ్డు వేయాలి.

👉 మా గ్రామంలో కొంత భూమి 22ఏ లో కలిసింది. 22ఏ నుండి ఆ భూమిని తొలగించాలి. అవసరాలకు అమ్ముకోలేక పోవుచున్నాము.

👉 గుండ్ల సముద్రం మాదిగ పల్లెకు స్మశాన వాటికకు  భూమి కేటాయించాలి.

               ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముందుగా గ్రామంలోని  ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
          దీనికి ముందుగా గ్రామంలో ఆయన పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.
ఇటీవల నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్డు నాణ్యత పరీక్ష ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
          మర్రిపూడి గ్రామంలో రీ సర్వే జరుగుతున్న తీరును కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. యానం నరసింహ, యానం గురవయ్య, యానం నాగయ్య భూములను అధికారులు రీసర్వే చేస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలోనే ఈ- కేవైసీ చేయాలని, రైతుల సమక్షంలోనే ఈ మొత్తం ప్రక్రియ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *