హైదరాబాద్ మే 17,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సొంతలాభం కొంతమానుకొని పొరుగువానికి సాయపడాలనే గురజాడ అప్పారావు సూక్తిని అణువణువునా నింపుకొని సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతోంది ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ సంస్థ. ప్రముఖ విద్యావేత్త, మానవతామూర్తి అచ్యుత సామంత 13 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బృహత్ మహోద్యమం నేడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. విశ్వశాంతికి, మానవీయ విలువల పరివ్యాప్తికి దాతృత్వ గుణమే మిన్న అనే సంకల్పంతో ఈ సంస్థ నిరంతరం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 11 నుంచి 17వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ట్ ఆఫ్ గివింగ్ వారోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. పి. రాజారమేష్ సారధ్యంలో ‘షేర్ టు షైన్’ (పంచుకోవడంలోనే ఆనందం) అనే నినాదంతో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో భాగంగా గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల్లో సుమారు 400 మంది ఆర్ట్ ఆఫ్ గివింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో యువజన సంఘాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
యువతలో క్రీడా స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులకు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు యువతను సానుకూల దృక్పథం వైపు నడిపించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా పలు గ్రామాలు, బస్తీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అలాగే పేద విద్యార్థులకు అభ్యాస సామాగ్రి అందజేయడంతో పాటు, మొక్కలు నాటడం, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త పి. రాజా రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ సేవలను స్థానికులు ఎంతగానో కొనియాడారు.
ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం కేవలం సహాయం అందించడానికే పరిమితం కాకుండా, దాతల విలువైన సమయాన్ని, విజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తోందని రాజా రమేష్ తెలిపారు. పరులకు సాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందనే సందేశంతో ఈ ఉద్యమం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200కు పైగా దేశాలకు విస్తరించిందని ఆయన వివరించారు. దాతృత్వాన్ని ఒక జీవనవిధానంగా మార్చాలన్న అచ్యుత సామంత ఆశయ సాధనలో తాము కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వలంటీర్లు పేర్కొన్నారు.
బాల్యంలో తాను అనుభవించిన పేదరికం మరెవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతో అచ్యుత సామంత కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) ద్వారా సుమారు 40 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నారు. సమాజంలో ఒకరికొకరు సహానుభూతితో మెలిగే సామరస్యపూర్వక వాతావరణాన్ని నిర్మించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇచ్చే చెయ్యి ఎప్పుడూ పైనే ఉన్నా, ఇచ్చే హృదయం మాత్రం స్వీకరించే హృదయంతో ఎల్లప్పుడూ సమానంగానే ఉంటుందనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.
ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పంజాగుట్టలోని సాయిబాబా ఆలయం వీధిలో గల ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్, కిట్ హైదరాబాద్ రీసోర్స్ సెంటర్’ను లేదా 9247561669, 9247551289 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.








