పేదలను ఆర్థికంగా ఆదుకోవలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి ( సి. ఎం . ఆర్.ఎఫ్) కి ఎక్కువ మొత్తం లో నిధులను కేటాయిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి చెప్పారు. బుధవారం సాయంత్రం తూర్పు నాయుడు పాలెం లోని ఆయన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు కొండేపి నియోజకవర్గంలోని 35 మంది లబ్ధిదారులకు సుమారు 19 లక్షల 43 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1764 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 29 లక్షల 37 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎన్.టి.ఆర్ వైద్య సేవ అందించటం తోపాటు సంజీవిని డిజిటల్ హెల్త్ ద్వారా వారికి ఏమన్నా ప్రమాదాలు ఉన్న వారిని అలెర్ట్ చేసి ఎక్కువ మంది ప్రాణాలు కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు దేశం లోని ఒక గొప్ప ప్రాజెక్ట్ ను తీసుకొచ్చినట్లు మంత్రి అన్నారు. మెరుగైన ఆరోగ్యం రాష్ట్ర ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో బిల్గెట్స్ సహాకారం తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు వైద్య అవసరాలకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, వారికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందిస్తున్నారని చెప్పారు.
