ఆన్‌లైన్ ఆటల ఉచ్చులో బాల్యం.తల్లిదండ్రుల నిఘా లోపమే ప్రధాన కారణం.చిన్నారుల గేమింగ్ ప్రమాదాలపై హైదరాబాద్ సీపీ సజ్జనర్.

హైదరాబాద్ జూన్ 24 :
ఫ్రీ ఫైర్’,ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్‌లైన్ మల్టీప్లేయర్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేశారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న అనేక ఫిర్యాదులు బయటకు కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ వాటి వెనుక ముఖ్యంగా ఈ ఆన్ లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. చిన్నారులభవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గేమింగ్ యాప్‌ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, వీటి నియంత్రణకుకఠినమైన చర్యలు
తీసుకునేలా గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు సైతం లేఖలు రాస్తామని పేర్కొన్నారు.
హ్యాకింగ్ కాదు.. సొంత బిడ్డల పనే.
మొబైల్‌కు వరుసగా డెబిట్ మెసేజ్‌లు రావడంతో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని ఆందోళన చెందుతూచాలామంది బాధితులు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేశాక బయటపడే నిజం తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇస్తోంది. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ లేదా మోసపూరిత లింకులు లేవని, పిల్లలే ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్‌లైన్ మల్టీప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలుచేయడానికి ఫోన్‌లో సేవ్ చేసిన కార్డ్స్ లేదా యూపీఐ వివరాలనువాడేశారని తేలుతుంది అన్నారు. ముఖ్యంగా, తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేసేస్తున్నారు. ఇది సాంకేతికంగా నేరం కానప్పటికీ, కేవలం ఇంట్లో పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతోంది. ఇటువంటి అజాగ్రత్తల వల్ల అసలైన సైబర్ నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది.
గేమ్ పరిచయం.. పక్క రాష్ట్రానికి పరుగు.
ఇటీవల జరిగిన మైనర్ బాలికల అదృశ్యం ఉదంతం ఆన్‌లైన్ ఆటలు, సోషల్ మీడియాతో పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి కళ్లకు కట్టింది. ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. ఆన్‌లైన్ మాయలో పడిపోయి.. కేవలం ఇంటర్నెట్‌లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలి, పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో గమనించడం, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం ఎంత అత్యవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది.
స్టేటస్’ కోసం దొంగచాటు ఖర్చులు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు నేడు క్లాస్‌రూమ్‌ల కంటే ‘ఫ్రీ ఫైర్, మ్యాక్స్’ వంటి గేమింగ్ వర్చువల్ యుద్ధభూమిలోనే ఎక్కువగా గడుపుతున్నారు. స్నేహితుల మధ్య తమ స్టేటస్ కోల్పోకూడదనే తాపత్రయమే దీనికి కారణం. ఆటలో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, ‘ఎలైట్ పాస్’ ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు దొంగచాటుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో చేతికి వచ్చిన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండటం, టెక్నాలజీపై వారికి తగినంత అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
పసిమనస్సులను కబళిస్తున్న ‘గేమింగ్ డిజార్డర్స్.
అతిగా ఆన్‌లైన్ ఆటలు ఆడటం కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒక భయంకరమైన మానసిక రుగ్మత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే గుర్తించి దీనికి ‘గేమింగ్ డిజార్డర్’ అని నామకరణం చేసింది. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సభ్యుల కంటే ఆటలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, నష్టాలు జరుగుతున్నా ఆట మానలేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. దీనివల్ల పిల్లల్లో తీవ్ర కోపం, దూకుడు ప్రవర్తన, చదువులో వెనుకబాటుతనం, నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక దూరం పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఆటలను కఠినంగా నిషేధించడం దీనికి సరైన పరిష్కారం కాకపోవచ్చు. అది వారిలో మరింత ఉత్సుకతను పెంచి దొంగచాటుగా ఆడేందుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, ఆటల సమయాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి అసలైన పరిష్కారం.
దేశ భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం అసలైన ‘ఫ్రీ ఫైర్’ గేమ్‌ను భారతదేశంలో నిషేధించింది. అయినప్పటికీ, సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు చిన్నారులు వీపీఎన్ ల ద్వారా దొంగచాటుగా ఈ నిషేధిత గేమ్‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు. మరోవైపు, ఈ గేమ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చిన ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో యథేచ్ఛగా లభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత గేమ్‌కు ప్రత్యామ్నాయంగా మారిన ఈ వెర్షన్‌కు చిన్నారులు అత్యంత వేగంగా ఆకర్షితులవుతూ, తీవ్ర వ్యసనానికి లోనవుతున్నారు.
ఇప్పుడైనా కళ్లు తెరవండి.పిల్లలను కాపాడుకోండి.
చిన్నారులను ఆన్‌లైన్ ఆటల ముప్పు నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తక్షణమే కొన్ని కీలక రక్షణ చర్యలు చేపట్టాలి. మొదటగా, పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ‘పేరంటల్ కంట్రోల్స్’, ‘పర్చేజ్ అప్రూవల్స్’ ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, వాటి ప్రాముఖ్యతను ఇంట్లోని వృద్ధులు, పెద్దవారికి కూడా వివరించాలి. అవసరమైతే పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరి మొబైల్ వాడినా సరే, రోజువారీ ఫోన్ వాడకంపై కచ్చితమైన సమయ పరిమితి విధించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ వారిలో తీవ్ర కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గడం, ఫోన్‌ను దొంగచాటుగా దాచడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చైల్డ్ సైకాలజిస్ట్‌ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి.ఈ అడ్వైజరీ ఆన్‌లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే, అదీ పరిమిత పరిధుల్లోనే ఆడాలి. మితిమీరిన గేమింగ్, నియంత్రణ లేని సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ప్రవర్తనతో పాటు వారి సమగ్ర వికాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘పర్యవేక్షణ (Monitor), మార్గదర్శకత్వం (Mentor), ప్రోత్సాహం (Motivate)’ అనే త్రిసూత్రాన్ని పాటించాలి. అలాగే, విద్యార్థులు లేదా చిన్నారులు ఆటల్లోనైనా సరే.. ‘క్లిక్ చేసే ముందు ఆలోచించండి’ (Think Before You Click, Even While You Play) అనే నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షించాలి. వారిలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, డిజిటల్ ప్రపంచానికి, నిజ జీవిత కార్యకలాపాలకు మధ్య సరైన సమతుల్యత ఉండేలా ప్రోత్సహించాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడమే పిల్లల భద్రతకు, వారి శ్రేయస్సుకు అత్యంత కీలకం. పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వల చిన్నారుల భవిష్యత్తును ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయకుండా, అలాగే ఆన్‌లైన్ వేధింపుల బారిన పడకుండా కాపాడుకోవడానికే ఈ మార్గదర్శకాలను విడుదల చేశాం. డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులకు, పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటోంది.”అని సీపీ అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *