హైదరాబాద్:
న్యాయం కోసం మహిళా కమిషన్‌ను ఆశ్రయించే బాధితుల సమస్యలను ఓపికగా, సహనంతో విని వారికి న్యాయం జరిగేలా సిబ్బంది వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సఖి సెంటర్ల సిబ్బంది, పోలీస్, లీగల్ రిప్రజెంటేటివ్‌లకు యూసుఫ్‌గూడలోని ‘నిమ్స్మే’ (NI-MSME) మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అట్రాసిటీల గురించి కమిషన్‌కు వచ్చాకే పూర్తి అవగాహన కలిగిందని, మహిళలు ఎన్ని రకాలుగా వేధింపులకు గురవుతున్నారో తెలిసి తీవ్ర బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సంబంధించిన అనేక కేసులను కొన్ని పోలీస్ స్టేషన్లలో కనీసం నమోదు కూడా చేయడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఇకపై తాము సఖి సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. మెంటల్ హెల్త్, మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, కౌన్సిలింగ్ విధానాలపై అవగాహన పెంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ ద్వారా సిబ్బంది మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో బాధితులకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, రాధాభాయ్, ఉజ్మా ఆషయ్ షాకీర్, కార్యదర్శి పద్మజ రమణ పాల్గొన్నారు. అలాగే రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరించిన హైదరాబాద్ లా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి గుడిమెళ్ల, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ డి.ప్రసన్నలక్ష్మి, సైకాలజిస్టులు గీతా చల్లా, వృషాలి రెడ్డితో పాటు పోలీస్, డి.ఎస్.ఎల్.ఏ ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్త సఖి సెంటర్ల సిబ్బంది పాల్గొన్నారు.

