ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆశయ స్ఫూర్తితో జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రకాశం భవనంలోని ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, బి.ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ .కామేపల్లి సీతారామయ్య, ఇతర ప్రముఖులు కలిసి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ‘ఆంధ్ర కేసరి’ జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను వారు తిలకించారు. అనంతరం ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ ను వారు శాలువాతో సన్మానించి గౌరవించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర్య పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని చేరుకోవటంలో ప్రకాశం పంతులు మన అందరికీ దర్శనీయమన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకాశం పంతులు స్ఫూర్తితో అభివృద్ధి పనులను వేగవంతం వేసామన్నారు. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపం, పార్కును అభివృద్ధి చేశామన్నారు. పంతులుగారు గొప్ప వ్యక్తి అని, అందుకే ఆయన పేరు ఈ జిల్లాకు పెట్టినట్లు గుర్తు చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యము కోసం పోరాడుతూనే, సంఘ సంస్కరణల కోసం కూడా కృషి చేశారని చెప్పారు. ధైర్యానికి, త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన మహనీయుని అడుగుజాడల్లో మందరము నడవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో పి.వి. రమణ, ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.




