మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం….

బేగంపేట ఆగస్ట్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసంచేసిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేటలోని దర్గాటవర్స్ కి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బొమ్మిశెట్టి సూర్యప్రకాశరావు బంధువు కేపీ పాండురంగారావు కుమార్తె కొత్త సాయిశ్రీ సుజిత 2024లో అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం పీజీ నీట్ పరీక్ష రాసి సీటు కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మల్లికార్జునరావు అనే వ్యక్తి తాను మెడికల్ అడ్మిషన్ కన్సల్టెంట్ ఏపీ, తెలంగాణలోని పలు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో పరిచయాలు ఉన్నాయని చెప్పాడు. అపోలో, గాంధీ తదితర ప్రముఖ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో పీజీ సీట్లు ఇప్పించగలనని నమ్మించాడు. ఇందుకు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతుందని చెప్పి, చివరకు అపోలో మెడికల్ కాలేజీలో పీజీ సీటు కోసం రూ.70 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా రూ.20 లక్షలు అడగ్గా బాధితులు రూ.10 లక్షలు మాత్రమే అడ్వాన్స్ చెల్లించి, సీటు వచ్చిన తర్వాత మిగిలిన మొత్తం ఇస్తామని తెలిపారు. ఇందుకు మల్లికార్జునరావు అంగీకరించడంతో అతడి బ్యాంక్ ఖాతా, ఫోన్పే నెంబర్ కు వేర్వేరు తేదీల్లో మొత్తం రూ.10 లక్షలు బదిలీ చేశారు. వాట్సప్ ద్వారా పీజీ సీటు విషయమై నిరంతరం సంప్రదింపులు జరిపినప్పటికీ డబ్బులు తీసుకున్న తర్వాత మల్లికార్జునరావు ఫోన్లకు స్పందించకుండా వివిధ కారణాలతో సీటు విషయాన్ని 2024 నుంచి ఇంటివరకు వాయిదా వేస్తూ వచ్చాడు. చివరకు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, నగదు తిరిగి ఇచ్చేది లేదని దుర్భాషలాడుతూ, మళ్లీ ఫోన్ చేస్తే అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *