గణేశ్‌ మహానిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం10 వేల సీసీ కెమెరాలు, 20 వేల మందితో పటిష్ట బందోబస్తు.

హైదరాబాద్ సెప్టెంబర్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్)
హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న వినాయక ఉత్సవాల ముగింపు ఘట్టమైన మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్‌ సిటీ పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఈ నెల 25న శుక్రవారం జరిగే తుది శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీసులు పకడ్బందీ బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేశారు. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌ సిటీ, పొరుగు జిల్లాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులు, వేలాది విగ్రహాల రాకను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి తదితర అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఖైరతాబాద్ బడా గణేష్‌ను 25 లక్షలు, బాలాపూర్ వినాయకుడిని 15 లక్షల మంది భక్తులుదర్శించుకోగా, చివరి రోజు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ముందస్తు సమీక్షలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం మూడు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది. నగర సీపీ వీసీ సజ్జనార్ పలు దఫాలుగా భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి, పీస్ కమిటీలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా 14,929 మండపాలకు అనుమతులు మంజూరు చేసి జియో ట్యాగింగ్ చేశారు. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 32,878 విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. శోభాయాత్ర మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపుల పనులను ఇప్పటికే పూర్తి చేశారు.ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు. శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. కీలక ప్రాంతాల్లో 24 అత్యాధునిక డ్రోన్లు, విగ్రహాల లెక్కింపు కోసం 100 హైరైజ్ కెమెరాలు, ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో కూడిన నిఘా బృందాలను మోహరించారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోని ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్‌తో పాటు మొఘల్‌పురా వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. జలాశయాల వద్ద నిపుణులైన ఆర్మీ, పర్యాటక శాఖల గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, రాత్రి వేళల కోసం వాచ్ టవర్లు, వైద్య సేవల కోసం అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలను సిద్ధం చేశారు. వాహనాలు మొరాయిస్తే ట్రాఫిక్‌ నిలిచిపోకుండా మెకానిక్‌లు, అదనపు డ్రైవర్లను ప్రధాన కూడళ్లలో ఉంచారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల నుంచి 20 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. బందోబస్తు అనుభవమున్న ఇతర జిల్లాల సిబ్బంది 8,142 మందితో కూడిన 42 ప్లాటూన్లను ఏడు జోన్లకు కేటాయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్ కంపెనీలను, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో 2 సీఆర్‌పీఎఫ్ కంపెనీలను మోహరించడంతో పాటు 53 బాంబ్ డిస్పోజల్ బృందాలను రంగంలోకి దించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. శోభాయాత్రలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డీజేలు, సౌండ్‌ మిక్సర్లు, అధిక శబ్ద తీవ్రత కలిగించే పరికరాలు, బాణసంచాపై పూర్తి నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం మూడు షిఫ్టుల్లో 26 షీ-టీమ్స్‌, మఫ్టీలో 25 ప్రత్యేక నిఘా బృందాలు పని చేస్తున్నాయి. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే డయల్‌ 112 లేదా 9490616555 వాట్సాప్ నంబర్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు.నగర ప్రజలంతా సంయమనం పాటిస్తూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. పవిత్రమైన ఉత్సవం పేరుతో మితిమీరి ప్రవర్తించినా, సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినా, పుకార్లు సృష్టించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైకోర్టు మార్గదర్శకాల మేరకే కేటాయించిన జలాశయాల్లో నిమజ్జనాలు జరపాలని, హైదరాబాద్ విశిష్ట సంస్కృతి అయిన గంగా-జమునా తెహజీబ్‌ను కాపాడుతూ పోలీసులకు సహకరించాలని కోరారు. వాహనాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని, ప్రసాదాల వితరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *